400 కోట్ల భూకుంభకోణం.. వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు..
posted on Jul 3, 2021 @ 12:29PM
ఏపీలో ఇప్పుడు అంతా భూదందా నడుస్తోంది. ఖాళీ స్థలం కనబడితే కబ్జా. ప్రభుత్వ భూములు ఎక్కడికక్కడ స్వాహా. భూకుంభకోణాలకు కేంద్రం మాత్రం విశాఖ అనే చెప్పాలి. ఉత్తరాంధ్రకు సామంతరాజులా వ్యవహరిస్తున్న ఓ వైసీపీ కీలక నేత ఆధ్వర్యంలో విశాఖలో భూదందా జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీడీపీ నేతల ఆస్తుల టార్గెట్‌గా చేస్తున్న ధ్వంస రచన మరోవైపు. మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని సైతం కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటే అంతకంటే దారుణం ఇంకేమీ ఉండదంటున్నారు. తాజాగా, వైసీపీ పెద్దల కన్ను.. భీమిలి రామానాయుడు స్టూడియోస్ మీద కూడా పడిందనే ప్రచారం నడుస్తోంది. విశాఖలో ఈ రేంజ్‌లో భూదందాలు సాగుతుంటే.. తామేమైనా తక్కువ తిన్నామా అన్నట్టు మిగతా జిల్లాల నేతలూ విశాఖ స్పూర్తిగా కబ్జాలకు తెగబడుతున్నారని అంటున్నారు. వైసీపీ పెద్దల అండా-దండాతో చిన్నచితకా నాయకులు సైతం భూకుంభకోణాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా, చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో భారీ భూ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈయన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కావడంతో విషయ ప్రాధాన్యం పెరిగింది. గ్రామాల్లో హైవేకు ఆనుకుని రూ.400 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు నల్లారి. మంత్రి, ఎంపీల అండ చూసుకొని వైసీపీ నేతలు భూ కబ్జాకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రభుత్వ భూములకు లే- అవుట్లు వేసి అక్రమంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణలకు సంబంధించిన ఊరు, సర్వే నెంబర్ల వివరాలను మీడియా ముందు ఉంచారు.
భూ కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు టీడీపీ నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి. భూకబ్జాలపై త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కొనుగోలు చేసిన భూములు చెల్లవని కోర్టులో తేలితే ప్రజలు నష్టపోతారని.. అందుకే ఆ భూములను ఎవరూ కొనొద్దని సూచించారు. భూ కుంభకోణం పీలేరు, మదనపల్లె, ఇతర ప్రాంతాలకు విస్తరించిందని చెప్పారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని నల్లారి ఆరోపించారు. అక్రమాలకు
సహకరించిన అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆరోపించినట్టు.. పీలేరులోనే 400 కోట్ల భూకుంభకోణం జరిగితే.. ఇక ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతల కబ్జాల విలువ ఎన్ని లక్షల కోట్లు ఉంటుందోనని మండిపడుతున్నారు ప్రజలు. జగనన్న పాలన.. అవినీతి, అక్రమాల పాలనగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.