ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
posted on Jul 22, 2020 @ 2:24PM
ఏపీ మంత్రులుగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పలాస ఎమ్మెల్యే అప్పలరాజు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వారి చేత ప్రమాణం చేయించారు. కరోనా కారణంగా రాజ్‌భవన్ లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కారణంగా కొద్ది మంది అతిథులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో చాలా మంది రాజ్‌భవన్ కు వచ్చినా లోనికి అనుమతించలేదు.
కాగా, మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారు మంత్రులుగా రాజీనామా చేశారు. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్లకు మంత్రులుగా సీఎం జగన్ అవకాశం కల్పించారు.
మరోవైపు, రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు ప్రమాణం చేశారు. మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ కొన్ని కారణాల వల్ల ఈ రోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆయన మరో రోజు ప్రమాణం చేస్తారు.