కరోనాపై వాస్తవాలు చెప్పండి
posted on Jul 22, 2020 @ 2:09PM
రాష్ట్ర చర్యలు, ఖర్చు చేస్తున్ననిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సిఎంకు లేఖ రాసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్రలో కరోనా వ్యాప్తిపై నిజాలు చెప్పాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. కరోనా పై ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేలా వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్నపరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
కరోనా కట్టడికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎందరో విరాళాలు ఇచ్చారు. ఈ వివరాలన్నీ శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించాలని సంజయ్ తన లేఖలో కోరారు.
"రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. ప్రభుత్వం పట్ల తీవ్ర అభద్రతా భావం నెలకొని ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై వైద్య సిబ్బందే ధర్నాలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలి. కరోనా వ్యాప్తిలో ప్రభుత్వ పనితీరును రాష్ట్ర హైకోర్టే సైతం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ తీరు పట్ల, ప్రజలకు అందుతున్న వైద్య సౌకర్యాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి తెలుసుకోవడానికి ప్రధాని మోదీ ఫోన్ చేసినప్పుడు ఆయన కు వాస్తవాలు చెప్పారో, లేదో అని సందేహంగా ఉంది. నిజాలను దాచి రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు" అని బండి సంజయ్ తన లేఖ ద్వారా సిఎంను కోరారు. రాజకీయాలకు తావులేకుండా సమష్టిగా కరోనాపై పోరాడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.