ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలి
posted on Jul 22, 2020 @ 2:42PM
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలంటూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. తద్వారా భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకం. ఈ చర్యలతో ఆర్టికల్ 243కె(2)కు సార్ధకత ఏర్పడింది." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో చెలరేగిన హింసా విధ్వంసాలు, అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రానికి అప్రతిష్ట వాటిల్లింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య 4 మూల స్థంభాల (లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, మీడియా) మనుగడ ప్రశ్నార్ధకమైంది." అన్నారు
"కరోనాలో ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసి తొలగింపు రాజ్యాంగ ఉల్లంఘనే. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడటం ముదావహం." అని వ్యాఖ్యానించారు
"ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు, పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలి. ఎస్ఈసి తొలగింపు వెనుక ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం నిష్పాక్షిక విధి నిర్వహణకు దోహద పడాలి. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కాపాడాలి." అని చంద్రబాబు ట్వీట్ చేశారు.