తుస్సుమన్న ఉద్యోగ సంఘాలు!.. వార్నింగ్‌లు ఇచ్చిన నేతలే వేడుకోలు..
posted on Dec 7, 2021 @ 1:47PM
ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా మేమే.. నిలబెట్టాలన్నీ మేమే.. పీఆర్సీపై జగన్‌రెడ్డి సర్కారు మోసం చేసింది. వైసీపీ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. మంగళవారం నుంచి తొలిదశ ఉద్యమం. అయినా, ముఖ్యమంత్రి దిగిరాకపోతే.. రెండో దశ ఉద్యమంతో సత్తా చాటుతాం. ఇదీ ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి.. ఇన్నాళ్లూ చేసిన హెచ్చరికలు. కట్ చేస్తే.. మంగళవారం రానే వచ్చింది. తొలిదశ ఉద్యమం మొదలైంది. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ర్యాలీలు తీశారు. అయితే, ఉద్యోగుల్లో ఐక్యత లేదు. ఉద్యోగ సంఘ నేతల్లో మునుపలి వాడి-వేడి కనిపించడం లేదు. ప్రభుత్వంతో తేల్చుకుంటామన్న నేతలే.. ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పైనుంచి బాగా ఒత్తిడి వచ్చినట్టుంది. బెదిరింపులూ గట్టిగానే ఇచ్చినట్టున్నారు. దెబ్బకు మాట మారిపోయింది. గొంతులో గాంభీర్యం తగ్గిపోయింది.
ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శించడంలేదని నమ్ముతున్నామని చెప్పారు. పీఆర్సీ ప్రకటిస్తే ఉద్యమాన్ని విరమించి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తామని చెప్పారు. తామంతా ముఖ్యమంత్రి బిడ్డలమని, కోపం వస్తే అలగడం సహజమని బండి శ్రీనివాసరావు అన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అందులో భాగమేనన్నారు. ప్రభుత్వం మొండిగా ఉండేటట్లు అయితే తిరుపతిలో పీఆర్సీ ఇస్తామని చెప్పరని శ్రీనివాసరావు అన్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వాన్ని కూలగొట్టేది మేమేనంటూ వార్నింగ్ ఇచ్చిన బండి.. తాజాగా సీఎంకు పాలాభిషేకం, పుష్పాభిషేకం అంటూ కాకా పడుతుండటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.
మరో సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సైతం సర్కారుపై సాఫ్ట్ కార్నర్ వహించారు. తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేదని చెప్పారు. ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందనే భావన ఉద్యోగుల్లో ఉందన్నారు. మరీ, బండి శ్రీనివాసరావులా కాళ్లబేరానికి రాకుండా.. బొప్పరాజు ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.
‘‘ప్రభుత్వం మొక్కుబడిగా ఒకట్రెండు సమావేశాలు నిర్వహించింది. దీనివల్ల ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. పీఆర్సీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించినా పట్టించుకోలేదు. కనీసం దానికి సంబంధించిన నివేదిక బయటపెట్టలేదు. దానికి కూడా ఎందుకు జంకుతున్నారు. నివేదిక బహిర్గతం చేయనివాళ్లు పీఆర్సీ ప్రకటిస్తారని ఎలా అనుకుంటాం?’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలా.. రెండు ప్రముఖ ఉద్యోగ సంఘాల నేతలు తొలి దశ ఉద్యమం ప్రారంభమైన తొలినాడే.. ఇలా మెతక మెతక మాటలు మాట్లాడటం చూస్తుంటే.. ఉద్యోగ సంఘ నాయకులు మొదట్లోనే చేతులెత్తేశాయని.. తెర వెనుక ఏదో జరిగిందని.. మిగతా ఉద్యోగులు మండిపడుతున్నారు.