ఎంపీని ఆహ్వానించకుండా అవమానం.. గుంటూరు వైసీపీలో ముసలం
posted on Dec 7, 2021 @ 1:45PM
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో వర్గ పోరు ముదురుతోంది. గుంటూరు వైసీపీలో ముసలం పుట్టింది. కొంత కాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సొంత పార్టీ నేతలు, ఎంపీలపై నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేటలో మంత్రుల పర్యటనకు తనకు ఆహ్వానం లేకపోవడంపై అధిష్టానానికి ఎంపీ లావు కృష్ణదేవరాయ ఫిర్యాదు చేశారు.
చిలకలూరిపేట మార్కెట్ యార్డు పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని, రంగనాథరాజు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీ కృష్ణదేవరాయకు ఆహ్వానం అందలేదు. ఎంపీని సొంతపార్టీ నేతలు, మంత్రులు పట్టించుకోలేదు. దీనిపై ఎంపీ కృష్ణదేవరాయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొందరు నేతలు కావాలనే తనకు ఆహ్వానం అందకుండా చేశారని ఎంపీ కృష్ణదేవరాయ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే రజనీ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాలా కాలంగా ఉప్పూ నిప్పుగా ఉంటున్నారు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ. ఈ రెండు వర్గాలు చాలా సార్లు బహిరంగ రచ్చకు దిగాయి. గత సంవత్సరం చిలకలూరి పేట నియోజకవర్గం పరిధిలో వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని వాహనం దిగనీయకుండా రజనీ వర్గీయులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని స్ధానిక వైసీపీ నేతలు ఎంపీని ప్రశ్నించారు. తాను పరామర్శ కోసమే వచ్చానని ఎంపీ చెప్పినా వారు వినిపించుకోలేదు. ఎంపీ వాహనం ముందుకెళ్లకుండా అడ్డుగా నిలబడ్డారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. తర్వాత కూడా పలు సార్లు ఎమ్మెల్యే, ఎంపీలు ఓపెన్ గానే విమర్శలు చేసుకున్నారు.