జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. గ్రామ సచివాలయ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
posted on Jul 12, 2021 @ 2:53PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. గ్రామ సచివాలయాలకు సంబంధించిన జగన్ రెడ్డి సర్కార్ ఇచ్చిన జీవో2ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌ల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ జగన్ సర్కార్ ఈ జీవో ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ఆ జీవోను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది.పంచాయతీ సర్పంచ్ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను.. వీఆర్‌వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు నిలదీసింది
ఏపీలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌ల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చి 25న జారీ చేసిన జీవో 2ని రద్దుచేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్ టి.కృష్ణమోహన్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున వాదనలను న్యాయవాది నర్రా శ్రీనివాస్ వినిపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్ధ అమల్లో ఉండగా.. ప్రభుత్వం సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. సమాంతర వ్యవస్ధ ఎందుకని ప్రశ్నించింది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, సర్పంచ్‌ల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని అడిగింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం... ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకే గ్రామ సచివాలయాలు, వీఆర్వో వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. సర్పంచ్, కార్యదర్శుల అధికారాలకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. దీంతో స్పందించిన న్యాయమూర్తి... నవరత్నాలను గ్రామ పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించారు. గతంలో పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శుల అధికారాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు తాజాగా ఇచ్చిన జీవో 2 విరుద్ధంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో పంచాయతీలకు సర్పంచ్ అలాగే అధిపతి అని న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు. కాబట్టి సర్పంచ్‌ల వ్యవస్ధను చక్కదిద్దేలా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. ఈ కేసులో వాదనలు పూర్తికావడంతో హైకోర్టు సోమవారం తీర్వు వెలువరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.