టీడీపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఆ ఐదుగురు..
posted on Jul 12, 2021 @ 3:29PM
టీడీపీ అధ్యక్షుడంటే అదో పదవి కాదు.. కుటుంబ పెద్దలాంటి బాధ్యత. తెలుగు తమ్ముళ్లదంతా ఒకే ఫ్యామిలీ. కష్టనష్టాల్లో కలిసే ఉంటారు. ఎన్ని సమస్యలు, ఆపద వచ్చినా.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. అందుకే, ఆనాడు ఎన్టీఆర్ తయారు చేసిన నాయకులు.. ఇప్పటికీ పార్టీనే అంటిబెట్టుకొని ఉన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీనే సర్వస్వంగా భావిస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో అంతాకలిసి పని చేస్తున్నారు. పార్టీ అంతా ఒక్కతాటి మీద నడుస్తోంది.
తాజాగా, కేసీఆర్ విసిరిన గాలానికి టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ చిక్కిపోయారు. సుదీర్ఘకాలం పార్టీనే నమ్ముకున్న ఆయన.. ఓ పదవి కోసం కండువా మార్చేశారు. అయితే, టీడీపీలో ఎల్.రమణలాంటి నేతలు ఎంతోమంది ఉన్నారు. ఒకరు పోతే.. పది మంది నాయకులు అధ్యక్ష పదవి కోసం సిద్ధంగా ఉన్నారు.
టీటీడీపీ నేతలతో రెండు రోజులుగా వర్చువల్ సమావేశం నిర్వహించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? కేసీఆర్‌పై పోరాటంలో యాక్టివ్‌గా ఉండే నాయకుడు ఎవరు? అంటూ సీనియర్ల నుంచి అభిప్రాయాలు సేకరించారని తెలుస్తోంది. రేసులో ప్రధానంగా ఐదుగురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
30 ఏళ్లుగా టీడీపీలో కార్యకర్తగా, క్రమశిక్షణ గల నాయకుడిగా కొనసాగిన రమణ పార్టీకి రాజీనామా చేయడంతో.. ఇప్పుడు నెక్ట్స్ ఎవరు అనే ప్రశ్న ఆసక్తి రేపుతోంది. బీసీ నాయకుడు రమణ స్థానంలో కొత్త టీటీడీపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదుగురి నేతలు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి, మరో సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. టీటీడీపీ పగ్గాలు బీసీ వర్గానికే ఇవ్వాలని అనుకుంటే అరవింద్ కుమార్ గౌడ్, ఎస్సీ సామాజిక వర్గానికి అయితే బక్కని నర్సింహులుకు ఇచ్చే అవకాశం ఉంది.
ఇక, తెలంగాణలో బలమైన రెడ్డి సమాజిక వర్గానికి ఈసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నారని తెలుస్తోంది. ఆ జాబితాలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నన్నూరి నర్సిరెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. మంచి వాగ్దాటి.. దూకుడు స్వభావం నర్సిరెడ్డికి అనుకూలాంశాలు. అయితే, సీనియర్ నేత, అందరినీ కలుపుకొని పోయే నేత.. రావుల చంద్రశేఖర్ రెడ్డి వైపు మెజార్టీ నాయకులు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పాలమూరు జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డికి విశేష రాజకీయ అనుభవం ఉంది. 1982లో కానాయపల్లి సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి 1985లో టీడీపీ జిల్లా కార్యదర్శిగా, 1987లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1994లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. 2002, 2008లలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
టీటీడీపీ రాష్ట్ర కమిటీకి నూతన అధ్యక్షుడి ఎంపిక బాధ్యత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుదే. టీడీపీకి ఎప్పుడూ నాయకుల లోటు లేదు. తెలుగుదేశం పార్టీ అంటే నాయకులను తయారు చేసే కర్మాగారం. ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉన్న హేమాహేమీ నేతల్లో చాలామంది ఒకప్పటి టీడీపీ నాయకులే. చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసి ఆరితేరిన వారే. తెలంగాణలో టీడీపీ పునర్ నిర్మాణం కోసం బలమైన నాయకుడిని టీటీడీపీ అధ్యక్షుడిని చేసేలా.. అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో రెండు రోజులపాటు వర్చువల్ పద్దతిలో విస్తృతంగా చర్చించారు. పార్టీ వర్గాల అభిప్రాయం మేరకు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబు.