మండలి ఎన్నికల్లో ఫేక్ ఓటర్లు! టీఆర్ఎస్ పై ఈసీకి ఫిర్యాదు
posted on Oct 12, 2020 @ 6:12PM
తెలంగాణ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఫేక్ ఓటర్లు ఉండబోతున్నారా? మండలి ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ అక్రమాలు చేస్తోందా?. తెలంగాణలో ఇదే ఇప్పుడు హాట్ చర్చగా మారింది. టీఆర్ఎస్ పార్టీ నకిలీ ధ్రువపత్రాలు పెట్టి బోగస్ ఓట్లు నమోదు చేయిస్తుందని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న అక్రమాలకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఆయన బుద్దభవన్ లో ఎన్నికల అధికారులకు సమర్పించారు. కొన్ని డాక్యుమెంట్లు, ఫోన్ కాల్స్ , చిత్రాలను కూడా తన ఫిర్యాదుకు జత చేశారు. సీనియర్ అడ్వకేట్ ఉమేశ్ చంద్రతో కలిసి వచ్చి ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు తన ఫిర్యాదును అందించారు తీన్మార్ మల్లన్న. మంత్రి మల్లారెడ్డి కాలేజీల కేంద్రంగా అక్రమ బాగోతం నడుస్తుందని ఆధారాలతో సహా ఎన్నికల అధికారులకు వివరించారు.
తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 1 నుంచి ఆ ఆరు జిల్లాల్లో ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతోంది. అయితే ఇక్కడే అధికార పార్టీ కుట్రలకు తెరలేపినట్లు తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. మండలి ఎన్నికలు లేని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన పట్టభద్రులతో ఇక్కడ ఓట్లు నమోదు చేయిస్తున్నారని చెప్పారు. మల్లారెడ్డి యూనివర్శిటీలు, కాలేజీల కేంద్రంగా అక్రమ బాగోతం జరుగుతుందని తెలిపారు. మల్లారెడ్డి కాలేజీలో పనిచేసే సిబ్బందిని ఇందుకు వినియోగిస్తున్నారంటూ.. కొందరు పట్టభద్రులతో వారు మాట్లాడిన ఆడియో కాల్స్ ను వినిపించారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మండలి ఓటరుగా ఉన్నవారితోనే ఇక్కడ అప్లయ్ చేయిస్తున్నట్లు ఆ ఆడియాలో స్పష్టంగా ఉంది. అంతేకాదు హైదరాబాద్ లో అప్లయ్ చేస్తే.. నిజామాబాద్ లో ఓటు పోతుంది కదా అని ఒకరు అనుమానం వ్యక్తం చేయగా.. అలాంటేదేమి ఉండదు.. అంతా మేము చూసుకుంటామంటూ మల్లారెడ్డి మనుషులు చెప్పడం ఆడియాలో ఉంది. ఈ ఆడియోలను కూడా ఎన్నికల అధికారికి సమర్పించారు తీన్మార్ మల్లన్న.
ఇతర జిల్లాల వారితో ఫేక్ ఓటర్లు నమోదు చేయించడమే కాదు.. మరింతగా మంత్రి మల్లారెడ్డి బరి తెగించారని మల్లన్న ఆరోపిస్తున్నారు. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు కూడా మల్లారెడ్డి కాలేజీలోనే తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ తయారు చేసిన నకిలీ గ్రాడ్యూయేట్ సర్టిఫికేట్లతోనూ ఓటర్లను నమోదు చేయిస్తున్నారంటూ .. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఎన్నికల అధికారికి ఇచ్చారు. రెండు నియోజకవర్గాల్లో కలిసి రెండు లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు నమోదు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుందని నవీన్ కుమార్ ఆరోపించారు. మల్లారెడ్డి కాలేజీల్లోనే ఇదంతా జరుగుతుందని, ఇందు కోసం ప్రత్యేకంగా కొందరిని నియమించారని చెప్పారు. లోకల్ ఎన్నికల అధికారులు కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారని శశాంక్ గోయెల్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు మల్లన్న.
ఎమ్మెల్సీ ఎలక్షన్ ల కు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలను తయారు చేస్తున్న మంత్రి మల్లారెడ్డి, అతని యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న, ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేయిస్తున్న మల్లారెడ్డిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసానని చెప్పారు . అడ్డ దారిన ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పార్టీలు ఉంటే ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు మల్లన్న.
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీలో ఉండబోతున్నారు తీన్మార్ మల్లన్న. ఆయన ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. ఓటర్ల నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సందర్భంలోనే అక్రమ ఓటర్ల సమాచారం తనకు చేరడంతో.. లోతుగా అధ్యయనం చేసినట్లు.. అందులో అదికార పార్టీ ఫేక్ బండారం బయటపడినట్లు మల్లన్న అనుచరులు చెబుతున్నారు. గత లోక్ సభ ఎన్నిక్లలో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మండలి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ లేదా హైదరాబాద్ ఏదో ఒక స్థానం నుంచి రాజశేఖర్ రెడ్డి బరిలో ఉండటం ఖాయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందుకే రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో బోగస్ ఓట్లు నమోదు చేయిస్తున్నారని చెబుతున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి తప్పదని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెాజార్టీ ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు కేసీఆర్ సర్కార్ పనితీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు వివిధ సర్వేల్లోనూ తేలింది. అధికార పార్టీ నేతలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. అయితే అధికార పార్టీగా ఉండి మండలి ఎన్నికల్లో ఓడిపోతే.. పరువు పోతుందనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే అడ్డదారిలో గెలిచేందుకు ఇలా బోగస్ ఓటర్లను స్పష్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ఎన్నికల అధికారులు పారదర్శకంగా, కఠినంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.