జగన్ సర్కార్ కు షాక్.. దేవినేని ఉమాకు బెయిల్
posted on Aug 4, 2021 @ 11:34AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి షాక్ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ వచ్చింది. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద దేవినేనిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సుమారు వారం రోజుల పాటు ఆయన్ను జైల్లోనే ఉంచారు.ఈ కేసులో బుధవారం ఉదయం ఉమకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొండూరులో అక్రమ మైనింగ్ బహిర్గతం చేసే సమయంలో దేవినేనిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి ఉమ తరపు న్యాయవాది తెలిపారు.
కృష్ణా జిల్లా మైలవరం నియోజక వర్గంలో మైనింగ్ వివాదం రచ్చ రాజేసింది. గత మంగళవారం మైనింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆయన కారుపై దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో మైనింగ్‌ను పరిశీలించి తిరిగి వస్తుండగా అడ్డుకున్నారు. ఉమ కారుపై రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులపనే అని దేవినేని అరోపించారు.అయితే పోలీసులు మాత్రం దేవినేని ఉమాపైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అర్ధరాత్రి దేవినేని ఉమాను జి.కొండూరు పోలీసులు అరెస్టు చేశారు. దేవినేనిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో హైడ్రామా నడిచింది. స్టేషన్ వద్ద భారీగా నాయకులు మోహరించడంతో దేవినేని ఉమాను తీసుకొస్తున్న పోలీసులు అక్కడికి అర కిలోమీటరు దూరంలోనే వాహనాన్ని నిలిపివేశారు. రాత్రి 7 గంటల నుంచి ఉమా అక్కడే కారులో ఆగిపోయారు. తాను ఫిర్యాదు ఇస్తానని, తీసుకోవాలని కోరినా పోలీసులు స్పందించలేదు. ఫిర్యాదు తీసుకునే దాకా తాను కదిలేది లేదని ఆయన భీష్మించుకుని అందులోనే కూర్చున్నారు. కారును తొలగించి, ఉమాను తరలించేందుకు పోలీసులు పెద్ద క్రేన్‌ను కూడా తెప్పించారు.అది వీలు కాకపోవడంతో చివరకు కారు అద్దాన్ని తొలగించి.. ఆ తర్వాత కారు డోరు తెరిచారు. అనంతరం ఉమాను అదుపులోకి తీసుకుని తమ వాహనంలోకి ఎక్కించుకుని వేకువజామున 1.15 గంటలకు తరలించారు. దేవినేని ఉమా అరెస్ట్, పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించి.. ధర్నాలు, నిరసనలు కూడా చేపట్టారు.