పవన్ కు బై బై .. జగన్ కు ఝలక్! ఏపీలో కమలం కొత్త ప్లాన్?
posted on Aug 4, 2021 @ 11:13AM
దేశంలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. బీజేపీ యేతర పార్టీలన్నీ, ఎవరికీ వారు కమల దళాన్ని లక్ష్యంగా చేసుకుని ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా 2024 ఎన్నికల్లో మోడీని గద్దె దించాలని గట్టి పట్టుమీడున్నాయి. బీజేపీ 2024 ఎన్నికల నాటికి దక్షిణాదిలో పట్టు పెంచుకునేందుకు తద్వారా ఉత్తరాదిలో సీట్ల పరంగా వచ్చే నష్టాన్ని కొంత వరకైనా తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇంత వరకు, ఒక్క కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ అంతగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాలపై పార్టీ ఎక్కడి కక్కడ. ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రంగా ప్రత్యేక వ్యూహాలతో పావులు కదుపుతోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు కూడా ఇందులో భాగంగానే జరిగిందని అంటున్నారు.
దక్షిణాది వ్యూహంలో భాగంగానే, కమల దళం తమిళనాడులో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏఐడిఎంకే కూటమి విజయం సాధించలేక పోయినా, బీజేపీ కొంత పట్టును అయితే సాధించగలిగింది. నాలుగు సీట్లు గెలిచింది. అసెంబ్లీలో కాలు పెట్టింది. తమిళనాడులో అంతర్భాగంగా ఉండే పుదుచ్చేరిలో అధికార పీఠాన్ని చేరుకుంది. మరోవంక కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు, ఎల్. మురుగన్’ కు స్థానం కల్పించింది. ఆయన స్థానంలో, మాజీ ఐపీఎస్ అధికారి, (2011 కర్ణాటక క్యాడర్) యువకుడు (37 ఏళ్ళు) అన్నామలైకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అన్నామలై 2019లో ఐపీఎస్ కు రాజీనామా చేసి, పార్టీలో చేరారు. ఆయన సారధ్యంలో పార్టీ ముందుకు సాగుతోంది. ఏఐడిఎంకేతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తోంది. స్టేట్’లో జూనియర్ పార్టనర్ అయినా, ఏఐడిఎంకేకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తోంది. పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారంలోనూ బీజేపీ పెద్దలు పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల ఏఐడిఎంకే కీలక నేతలు మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి, పంన్నీర్ సెల్వం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.అలాగే, బీజేపీ అగ్ర నేతలతో సమావేశమై రాష్ట్రంలో కూటమిని బలోపేతం చేసే అంశంపై మాత్రమే కాకుండా పార్టీ (ఏఐడిఎంకే) అంతర్గత సమస్యలు, ముఖ్యంగా శశికళ సృష్టిస్తున్న అలజడి పై చర్చించారని సమాచారం.
ఇంతవరకు అంతగా పట్టించుకోని తెలుగు రాష్ట్రాలపై ముఖ్యంగా ఏపీ పై కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది.ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న నేపధ్యంలో, మూడో ప్రత్యాన్మాయంగా ఎదిగే ప్రయత్నంలో భాగంగా రెండు సంవత్సరాల క్రితమే బీజేపీ, మాజీ మిత్రపక్షం జన సేనను మళ్ళీ దగ్గరకు తీసుకుంది. ఉభయ పార్టీలు కలిసి ఉధ్యమాలు చేయాలని, ప్రాంతీయ పార్టీల పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, జనంలోకి తీసుకు వెళ్ళాలని,2024లో జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో జెండాలే కాకుండా అజెండాలు కూడా వేరు కావడంతో గడచిన రెండు సంవత్సరాలలో రెండు పార్టీల ఉమ్మడి పోరాటం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉండిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ ఉమ్మడి పోరు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.ఈ నేపధ్యంలో, ఇరు పార్టీల మద్య దూరం పెరిగింది. మరో వంక బేజేపీ కేంద్ర నాయకత్వం మారిన పరిస్థితుల్లో, పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి ముందు, పార్టీని పటిష్ట పర్చుకోవాలని, పొత్తుల విషయం ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవచ్చని రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ముఖ్యంగా పార్టీ కోర్ ఇష్యూస్ మీద కాన్సంట్రేట్ చేయాలని, ఇందుకు కోసంగా అవసరం అయితే జనసేనతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జనసేన దూరంగా ఉన్నా, కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు సంబందించిన బీజేపీ ఒంటరిగానే పోరాటం చేసింది.టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర సోమువీర్రాజు ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయమై ఆందోళనలు చేపట్టారు.చివరకు ఈ వివాదాల నేపథ్యంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో కాషాయ దళంలో జోష్ పెరిగింది. ఈ ఊపులోనే కావచ్చు సోము వీర్రాజు బీజేపీ చేస్తున్న ఆందోళనలకు జనసేన కలిసిరావడం లేదని బహిరంగంగా ఆరోపించారు.
ఆంధ్ర ప్రదేశ్ పై బీజీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది అనేందుకు సంకేతమా అన్నట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్ ఇటీవల రాష్ట్రంలో పర్యటించారు. పొత్తుల విషయాన్నిపక్కన పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న జగన్ రెడ్డి అరాచక పాలన, ముఖ్యంగా అద్వాన్న స్థితికి చేరిన ఆర్థిక పరిస్థితి, దేవాలయాలపై జరుగతున్న దాడులు, క్రైస్తవీకరణ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు చేపట్టాలని ఆయన గట్టిగా సూచించారు. ఈ నేపధ్యంలోనే, ఇటీవల కాలంలో బీజేపీ, ఆందోళన బాట పట్టింది. ముందు పార్టీ క్యాడర్’లో ఉత్సాహాన్ని నింపి, క్రియాశీలంగా ఉద్యమాలు నిర్వహిస్తే, ఎన్నికల సమయంలో పొత్తుల పై నిర్ణయం తీసుకోవచ్చని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఈ వాస్తవాన్ని గ్రహించే, జగన్ ప్రభుత్వం పొద్దుటూరు టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో జాగ్రత్త పడిందని అంటున్నారు. ఏమైనా, ఏపీ బీజేపీలో కొద్దో గొప్పో కదలిక అయితే వచ్చింది, ఎంతవరకు నిలుస్తుందో .. ఏమవుతుందో ముందు ముందు గానీ తేలదని, పరిశీలకులు బావిస్తున్నారు.