ఏపీ ప్రజలపై జగన్ పవర్ బాంబ్.. 8 నెలల్లో 36 వందల కోట్లు టార్గెట్
posted on Sep 7, 2021 @ 7:38PM
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాకుల మీదు షాకులు ఇస్తోంది జగన్ రెడ్డి సర్కార్. ఇటీవలే ఆస్తి పన్ను పెంచింది. చెత్త పన్నును భారీగా వసూల్ చేస్తోంది. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలకు పెంచిన పన్నులు భారంగా కాగా.. మరో భారం వేయడానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం. పవర్ బాంబ్ పేల్చడానికి కసరత్తు చేస్తోంది. విద్యుత్ సంస్ధలు నష్టపోయిన మొత్తాల్ని వినియోగదారుల్ని అదనపు ఛార్జీల రూపంలో పిండి మరీ వసూల్ చేయాడనికి ప్రణాళికలు రచించింది. ప్రభుత్వ నిర్ణయంతో వచ్చే 8 నెలల పాటు ఏపీలో కరెంటు బిల్లుల మోత మోగబోతోంది. డిస్కంల వారీగా బిల్లుల మోతలో తేడాలు కూడా ఉండబోతున్నాయి
2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్ధిక సంవత్సరం వరకూ అంటే ఆ ఐదేళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి అయిన ఖర్చు సరఫరాకు అయిన ఖర్చుకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని నష్టాల రూపంలో ప్రజలపై రుద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీటిని ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వసూల్ చేయబోతోంది. దీని ప్రకారం అప్పుడు తలెత్తిన నష్టాల్ని ఇప్పుడు వాడకం ఆధారంగా వినియోగదారుల నుంచి సర్దుబాటు రూపంలో వసూలు చేస్తారు. గతంలో జరిగిన నష్టాన్ని 10 శాతానికి పైగా వడ్డీతో కలిపి మరీ డిస్కంలు వినియోగదారులపై వేయబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్ధ తూర్పు ప్రాంత విద్యుత్ సరఫరా సంస్ధ ఉన్నాయి. ఈ రెండు డిస్కంల పరిధిలో రెండు వేర్వేలు ఛార్జీలు విధించబోతున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్ కు రూ.1.27 చొప్పున.. ఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్ కు రూ.0.45 చొప్పున అదనపు ఛార్జీలు విధించబోతున్నారు.
గతంలో ఆయా విద్యుత్ పంపిణీ సంస్ధలు చవిచూసిన నష్టాల ఆధారంగా ఈ ఛార్జీల లెక్కింపు చేపడుతున్నారు. ఆయా డిస్కంల పరిధిలో ఉన్న వినియోగదారులకు వీటి ఆధారంగానే అదనపు ఛార్జీలు పడతాయి. ఇప్పటివరకూ తాము వాడుతున్న బిల్లుల మొత్తాన్నే చెల్లించే వినియోగదారులు.. సెప్టెంబర్ నుంచి తాము వాడని మొత్తాన్ని సైతం అదనపు ఛార్జీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. 8 నెలల పాటు వీటి వడ్డన ఉంటుంది. ఇందులో ప్రస్తుతం 200 యూనిట్లు వాడుతున్న ఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారుడు కొత్త బిల్లుల్లో దాదాపు రూ.250 మేర అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులపై అయితే రూ.90 మేర అదనపు ఛార్జీల భారం పడుతుంది. ఈ లెక్కన వచ్చే 8 నెలల్లో రూ.3600 కోట్ల రూపాయల భారం వినియోగదారులపై మోపేందుకు విద్యుత్ సంస్ధలు సిద్ధమయ్యాయి.
వాస్తవానికి ఏపీలో డిస్కంలు గతంలో ఐదేళ్ల పాటు తమకు కలిగిన నష్టాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ప్రతిపాదించిన అదనపు ఛార్జీలు రూ.7200 కోట్లు. కానీ ఈఆర్సీ మాత్రం రూ.3600 కోట్ల వసూళ్లకు మాత్రమే అనుమతిచ్చింది అంటే మొత్తం ఛార్జీలు ఇప్పుడే వసూలు చేయబోరన్న మాట. మొత్తం ఛార్జీలు ఒకేసారి వసూలు చేయడం మొదలుపెడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు కాబట్టి ఇప్పుడు సగం ఛార్జీలు మాత్రమే వసూలు చేసి ఆ తర్వాత మిగతా ఛార్జీలు మరోసారి వడ్డిస్తారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ మరో సగం ఛార్జీల వడ్డన తప్పదని తేలిపోయింది. జగన్ సర్కార్ పన్నుల మోతపై ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.