ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిథి పదవి వరించేదెవరిని?
posted on Aug 14, 2024 @ 10:23AM
ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్రమంత్రి, కేంద్ర మంత్రి, స్పీకర్ తర్వాత కీలకమైన పదవి ఏదైనా ఉందంటే అది ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి మాత్రమే. వాస్తవానికి సీఎంలు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఆయన వెన్నంటి ఉండటం, కేంద్ర మంత్రులతో అపాయింట్‌మెంట్ల వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది. అంతకు మించి ఆ పదవిలో ఉన్న వారికి పెద్ద పనేం ఉండదు.
కానీ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే కూటమికి తెలుగుదేశం మద్దతు అత్యంత కీలకమైనది కావడం, అదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాల్సిన పరిస్థితి కారణంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిథి పదవికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత పెరిగింది. దాంతో సహజంగానే ఆ పదవి కోసం పోటీ పడుతున్న తెలుగుదేశం ఆశావహుల సంఖ్యా అధికంగా ఉంది. ఒక్క తెలుగుదేశం నేతలే కాదు.. తెలుగుదేశం కూటమి పార్టీల నేతలు కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు.
వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత విజయవాడ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. అలాగే ఉండి ఎమ్మెల్యే ర ఘురామకృష్ణం రాజు కూడా ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిథి పదవిని ఆశిస్తున్నారు. వీరిరువురూ కాకుండా ఇంకా పలువురు తెలుగుదేశం సీనియర్లు కూడా ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. మాజీ ఎంపి కనకమేడల రవీందర్ , మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్‌రావు, గుంటూరు మాజీ ఎంపి గల్లా జయదేవ్ లు కూడా రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరిని చంద్రబాబు ఆ పదవికి ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది.