తెలుగుదేశం నేత, మాజీ సర్పంచ్ దారుణ హత్య
posted on Aug 14, 2024 @ 9:52AM
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై జగన్ కారుస్తున్నది మొసలి కన్నీరేనని మరో సారి రుజువైంది. హత్యలు, దాడులు అన్నీ తమ పార్టీ వారే చేస్తుంటే.. అధికార పార్టీ వారు దాడులకు పాల్పడుతున్నారంటూ దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుగా జగన్ ప్రచారం ఉందనడానికి కర్నూలు జిల్లాలో జరిగిన తెలుగుదేశం నాయకుడు, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసుల హత్య తాజా ఉదాహరణగా నిలుస్తుంది.
పత్తికొండ మండలం హోసూరులో తెలుగుదేశం నేత, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు వైసీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. బహిర్భూమికి వెళ్లిన ఆయనపై వైసీపీ మూకలు దాడి చేసి కంట్లో కారం కొట్టి దారుణంగా హత్య చేశాయి. ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం తరఫున కీలకంగా పని చేసినందుకే వాకిటి శ్రీనివాసులును వైసీపీ గూండాలు అతి కిరాతకంగా హతమార్చాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా క్షేత్రంలో తిరస్కారానికి గురైనా జగన్ అండ్ కో కు బుద్ధి రాలేదనీ, ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగాని తనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.