చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా.. భూమికి దూరంగా
posted on Dec 29, 2020 @ 3:20PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో విడత రైతు భరోసా నిధులు, నివర్ తుఫాను నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నిధులు విడుదల చేశారు. మొత్తం 1766 కోట్లను 50 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు మొత్తం రూ.13,101 కోట్లను ప్రభుత్వం అందించిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.13,500 లు చొప్పున ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
నివర్ తుఫాన్ నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికే పలుమార్లు చెప్పామని.. అయినా కూడా చంద్రబాబు ప్రతిపక్షనేతగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడ్డారు. పుత్రుడిని, దత్తపుత్రుడిని ఒక్క రోజు ముందు చంద్రబాబు రోడ్డు మీదకు పంపారంటూ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా.. భూమికి దూరంగా ఉంటున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, 12 కోట్లు కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ చెప్పిందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మోసాన్ని భరించలేకే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.