బీజేపీకి సీఎం జగన్ సరెండర్! రఘురామ కేసులో అమిత్ షా సైలెంట్..
posted on Jun 14, 2021 @ 4:54PM
కేంద్రంలో చేరడం.. మంత్రి పదవులు చేపట్టడం కానే కాదట. పోలవరం నిధుల ప్రస్తావనే రాలేదట. మూడు రాజధానుల అంశమూ చర్చించలేదట. జస్ట్ 2 పాయింట్ ఎజెండాతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారట సీఎం జగన్‌రెడ్డి. తనపై ఉన్న సీబీఐ కేసులు.. రఘురామ ఎపిసోడ్.. ఈ రెండు అంశాలపైనే గంటకు పైగా మీటింగ్ జరిగిందట. లోపలంతా దబిడి దిబిదేనట.. కాస్త ఆలస్యంగా ఢిల్లీ వర్గాల నుంచి వచ్చిన పక్కా సమాచారం ఇది.
అమిత్‌షా ముందు పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యారట జగన్‌రెడ్డి. తనను సీబీఐ కేసుల నుంచి బయటపడేయండి.. మీరు ఏది చెబితే అది చేస్తా.. మీరు ఏది రైట్ అంటే అదే రైట్ అంటానంటూ కాళ్లబేరానికి వచ్చారని చెబుతున్నారు. జగన్‌రెడ్డి, ప్రశాంత్ కిశోర్ మధ్య రహస్య మంతనాలు, ఎన్డీయే కూటమివైపు సమాలోచనల గురించి తమ దగ్గర సమాచారం ఉందంటూ అమిత్‌షా జగన్‌రెడ్డిని ప్రశ్నించడంతో మనోడు ఒక్కసారిగా షాక్ తిన్నాడట. ఒక్కసారిగా అవాక్కయి, అంతలోనే తేరుకొని.. అలాంటిదేమీ లేదని.. తాను బీజేపీకే మద్దతుగా ఉంటానని ఘంటాపథంగా చెప్పుకొచ్చారని తెలుస్తోంది. ఎన్డీయే కూటమికే తన సంపూర్ణ మద్దతు అని అమిత్‌షాకు తేల్చి చెప్పారట సీఎం జగన్‌రెడ్డి. అమిత్‌షా ముందు క్విడ్ ప్రోకో ప్రతిపాదన తీసుకొచ్చారట. మేం మీకు అన్ని రకాలుగా పూర్తి మద్దతుగా ఉంటాం.. మీరు మాకు కేసుల విషయంలో సహకరించండంటూ డీల్ ప్రపోజ్ చేశారట. ప్రత్యేక హోదా.. పోలవరం నిధులు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఎప్పటిలానే మౌనంగా ఉంటాం.. అందుకు ప్రతిఫలంగా సీబీఐ కేసుల దూకుడు తగ్గించాలని, తనకు పక్కలో బల్లెంలా మారిన రఘురామను సైడ్ చేసేందుకు కేంద్ర మద్దతు కావాలని అమిత్‌షాను జగన్‌రెడ్డి వేడుకున్నారని అంటున్నారు.
అయితే, ఎప్పటిలా కాకుండా ఈసారి అటునుంచి మిశ్రమ స్పందన వచ్చిందని తెలుస్తోంది. సీబీఐ కేసుల విషయం వరకు అయితే ఓకే అని అమిత్‌షా అన్నట్టు సమాచారం. అయితే, ఎంపీ రఘురామ విషయంలో మాత్రం అమిత్‌షా నుంచి ఎలాంటి హామీ దక్కలేదట. రఘురామ తన కాలి గాయాల ఫోటోలతో సహా దేశంలోని ఎంపీలు, సీఎంలు అందరికీ ఇప్పటికే లేఖలు రాశారని.. ఇప్పుడది కేంద్రం కోర్టులో లేదని.. రఘురామతో ఏపీ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించారో యావత్ దేశానికి తెలిసిపోయిందని.. ఓపెన్‌గా ఇంత డ్యామేజ్ జరిగిపోయాక.. ఇప్పుడు తామేమీ చేయలేమన్నట్టు అమిత్‌షా చేతులెత్తేశారని తెలుస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్టుగా అమిత్‌షా మాట్లాడారని అంటున్నారు.
కనీసం తమ పార్టీ ఫిర్యాదు మేరకైనా.. రఘురామ పార్లమెంట్ సభ్యత్వంపై స్పీకర్ వేటు వేసేలా హెల్ప్ చేయాలని జగన్‌రెడ్డి మరోసారి అమిత్‌షాను రిక్వెస్ట్ చేశారట. అయితే, రఘురామకు స్పీకర్ ఓం బిర్లాతో మంచి సంబంధాలు ఉన్నాయని.. రఘురామకు వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీల్లో ఉన్న 50 మందికి పైగా క్షత్రియ వర్గ ఎంపీలు మద్దతుగా ఉన్నారని.. అనేకమంది బీజేపీ క్షత్రియ ఎంపీలు సైతం రఘురామకు సపోర్ట్‌గా తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. ఇప్పటికే బాగా డ్యామేజ్ జరిగిపోయిందని.. ఈ విషయంలో తామేమీ చేయలేమని.. అమిత్‌షా స్పష్టం చేశారని తెలుస్తోంది. జరగబోవు పరిణామాలను పార్లమెంట్‌లోనే తేల్చుకోవాలని జగన్‌రెడ్డికి సూచించారట అమిత్‌షా. ఎంపీ రఘురామ ఎపిసోడ్‌లో ఏకంగా కేంద్రమే హ్యాండ్సప్ అనడంతో జగన్‌రెడ్డి తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నారని అంటున్నారు.