జగన్ కు జబర్దస్త్ ఝలక్.. రాక్షసులే బెటరన్న అశోక్
posted on Jun 14, 2021 @ 4:12PM
ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్టు కేసులో ఏపీ హైకోర్టు తీర్పు సంచలనంగా మారింది. మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి నియామకాన్ని రద్దు చేస్తూ, చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వేల మంది ఉద్యోగులకు అండగా నిలిచిందని తెలిపారు. అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్న విషయం తాజా తీర్పుతో వెల్లడైందన్నారు చంద్రబాబు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి స్పష్టమైందని అన్నారు.
ట్రస్టు ఆధ్వర్యంలోని వేలాది భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్ దుర్మార్గ ఆలోచనలకు అడ్డుకట్ట పడిందన్నారు చంద్రబాబు. హైకోర్టు తీర్పుతో తుగ్లక్ ముఖ్యమంత్రికి చెంపపెట్టు అని అభివర్ణించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోర్టులో ఇన్నిసార్లు తలదించుకున్నది లేదని చంద్రబాబు విమర్శించారు. ఇకనైనా ముందు వెనుకలు ఆలోచించకుండా జీవోలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. ట్రస్టును కాపాడుకున్నారంటూ అశోక్ గజపతిరాజుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.
దేశంలో చట్టాలున్నాయని మరోసారి రుజువైందని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. తాను ట్రస్టు చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారని, అక్రమాలు నిజంగానే జరిగుంటే ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. తనపై కక్షతో మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులను పలు ఇబ్బందులకు గురిచేశారని, ఈ క్రమంలోనే మాన్సాస్ ట్రస్టు కార్యాలయాన్ని మరోచోటికి తరలించారని ఆరోపించారు. ఆఖరికి మూగజీవాలను కూడా హింసించారని, రాక్షసులు కూడా ఇలా చేసివుండరని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. తీర్పు ఉత్తర్వులు అందాక మిగతా వివరాలు అందిస్తానని అశోక గజపతి రాజు తెలిపారు.
మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం జగన్ ను కలిసి తాజా పరిణామాలను నివేదించారు. అనంతరం మాట్లాడుతూ, మాన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కోర్టు ఆదేశాలను బట్టి మళ్లీ అప్పీల్ కు వెళతామని చెప్పారు. తాము ఏం చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగానే ముందుకు వెళతామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. మాన్సాస్ ట్రస్టు అంశంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.