చంద్రబాబుకి తూళ్ళూరు రైతులు సత్కారం
posted on Dec 13, 2014 @ 10:44AM
ఈరోజు విజయవాడ నగరంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తూళ్ళూరు మండలంలో గ్రామాల రైతులు ఘనంగా సత్కరించారు. ఆ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, “నేను రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొనే రుణమాఫీ చేసాను. కానీ ప్రతిపక్ష పార్టీ లేనిపోని నిందలు వేస్తూ దానిపై కూడా రాజకీయాలు చేస్తోంది. తూళ్ళురులో రాజధాని కట్టడం ద్వారా రైతులకు చాలా ప్రయోజనం కలుగుతుంది. ఆ విషయం ఇప్పటికే మీ అందరికీ భోదపడి ఉంటుంది. ఇక్కడ రాజధాని నిర్మించాలని అనుకొన్న తరువాతనే ఇక్కడి భూములకు విపరీతమయిన డిమాండ్ ఏర్పడింది. అందుకే ఎక్కడెక్కడి నుండో ఎవరెవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులు మీ చుట్టూ భూముల కోసం తిరుగుతున్నారు. రాజధాని నిర్మిస్తే అందరి కంటే ఎక్కువ ప్రయోజనం పొందేది రైతులేనని నేను ఖచ్చితంగా చెప్పగలను. రైతులలో అత్యంత ప్రధానమయిన ప్రాంతాలలోనే మీరు అందరూ ఇళ్ళు కట్టుకొని కలకాలం సుఖంగా నివాసం ఉంటారు. అది నా హామీ. ఎవరో మహా నేతలు చేసే ప్రచారానికి, చెప్పుడు మాటలకీ తలోగ్గవద్దని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నామీద పూర్తి నమ్మకం ఉంచండి. మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా అన్ని విధాల లాభాపడేలా చేస్తాను. సింగపూర్ ప్రభుత్వం కూడా ఆ నమ్మకంతోనే ముందుకు వచ్చింది. అందరూ కలిసి ఒక అద్భుతమయిన రాజధాని నిర్మించుకొందాము. ఆ ఘనత మీకే దక్కాలి,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.