రాజధాని లేని రాష్ట్రం.. జగన్ నిర్వాకం.. పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం
posted on Feb 13, 2023 5:19AM
మొండివాడు రాజుకంటే బలవంతుడు, ఇక రాజే మొండివాడయితే, ఆ రాజ్యం, నేటి ఏపీ అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ముక్కలై, నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్టం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలైంది, అయినా ఇంతవరకు,రాజధాని లేని రాష్ట్రంగానే ఏపీ మిగిలిపోయింది. నిజానికి, రాష్ట్ర విభజన జరిగిన వెంటనే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, అందరి ఆమోదంతో, అమరావతి కేంద్రంగా దివ్యభవ్య రాజధాని నిర్మాణానికి, శ్రీకారం చుట్టారు.ఆ ప్రాంత రైతులు, నభూతో న భవిష్యతి అన్న విధంగా, రాజధాని కోసం 33,700 ఎకరాల భూమిని, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సిఆర్‌డిఎకు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
అయితే బాలారిష్టాలను దాటుకుని, రాజధానికి ఒక రూపం స్వరూపం వస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. 2019 ఎన్నికల్లో, ‘ఒక్క ఛాన్స్’ అభ్యర్ధనతో అధికారంలోకి వచ్చిన వైసీపే అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్ళు చల్లారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలకు వాగ్దానం చేసిన ఆయన,మాట తప్పారు, మడమ తిప్పారు. ప్రతిపక్ష నేతగా శాసన సభలో అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి, అదే సభలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే,అధికార వికేద్రీకరణ వంకన మూడు రాజధానుల ప్రతిపాదనతో అగ్గి రాజేశారు. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడి మూడు రాజధానుల ప్రకటన చేశారు.ముఖ్యమంత్రి ప్రకటనతో ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని లేకపోవడమే రాష్ట్రాభివృద్ధికి పెద్ద ప్రతిబంధకంగా మారింది. 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడగానే అమరావతిని కాదని మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడం తెలిసిందే. ఇక అప్పటి నుంచీ రాష్ట్రానికి రాజధాని ఏదన్న విషయంలో ఎర్నడిన గందరగోళం రాష్ట్ర అభివృద్ధని ప్రశ్నార్థకం చేసేసింది. జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. విశాఖ, కర్నూలు అంటూ ప్రభుత్వం మాటలు చెప్పిందే కానీ.. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడిన దాఖలాలు లేకుండానే నాలుగేళ్లు గడిచిపోవచ్చాయి.
ఇక అదే రాజధాని విషయంలో ఉన్న ప్రతిష్ఠంభన మీమాంస కారణంగా రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా? లేదా అన్నది ఓ పెద్ద సందేహంగా మారిపోయింది. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతి శాసన వ్యవహారాల రాజధానిగా ఉంటాయని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంటూ ముఖ్యమంత్రి అ జగన్ ప్రకటించిన తరువాత ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమరావతే రాజధాని అంటూ లోక్ సభ సాక్షిగా ప్రకటించే వరకూ.. ఏపీ అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్రం అంత విస్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా విశాఖ రాజధాని అంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు అయోమయాన్ని ఇంకా కొనసాగించేందుకే ఉపయోగపడుతున్నాయి. ఇక ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది.
అయితే.. కోర్టులో ఉన్న అంశంపై ముఖ్యమంత్రి జగన్ హస్తినలో జరిగిన ఏపీ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో చేసిన విశాఖ రాజధాని అన్న వివాదాస్పద వ్యాఖ్యలు సైతం గందరగోళాన్ని మరింత పెంచేవిగానే ఉణ్నాయి. ఇలాంటి గందరగోళం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలను ఎంతగా దెబ్బతీస్తోందో ఈ మూడున్నరేళ్ల పైబడిన కాలంలో చూస్తూనే ఉన్నాము. 2015 ఏప్రిల్ లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. అప్పటి నుంచీ రాజధాని విషయంలో అయోమయం, గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇన్నేళ్ల పాటు రాజధాని అన్నది లేకుండా రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయింది. పలు అవకాశాలను చేజార్చుకుంది. పెట్టుబడుల విషయంలో అధ:పాతాళానికి దిగజారిపోయింది.