ఏపీకి కొత్త గవర్నర్.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేనా?
posted on Feb 13, 2023 5:53AM
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌ను కేంద్రం చత్తీస్ ఘడ్‌కు బదిలీ చేసింది. ఆయన స్థానంలో గత నెలలో పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమించింది. అయోధ్య కేసుతో పాటు ట్రిపుల్ తలాక్ కేసులపై తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల ధర్మాసనంలో అబ్దుల్ నజీర్ కూడా ఒకరు. అటువంటి ఆయనకు అలా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారోలేదో ఇలా గవర్నర్ గా పదవి ఇచ్చేసింది కేంద్రం. ఏపీ గవర్నర్ బదలీతో పాటు మరికొన్నిరాష్ట్రాల గవర్నర్ల బదలీ కూడా జరిగినప్పటికీ, ఏపీ గవర్నర్ బదిలీ మాత్రం రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో పాటు, రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది.
బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ గా యాక్టివ్ గా లేరు. ఇందుకు ఆయన వయస్సు కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం పంపుతున్న వివాదాస్పద బిల్లులు, నిర్ణయాలన్నింటికీ ఆమోద ముద్ర వేస్తూ వచ్చారు. ఆయన ఆమోదించిన పలు బిల్లులు కోర్టుల్లో వీగిపోయాయి. దీంతో గవర్నర్ పై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం గవర్నర్ ను హామీగా చూపించి రుణాలు తీసుకున్నా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఏపీ ప్రభుత్వం.. కేంద్రంతో సన్నిహితంగా ఉంటుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతుగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం అని ఇప్పటి వరకూ అంతా అనుకుంటూ వచ్చారు. అయితే హఠాత్తుగా ఇప్పుడు కేంద్రం ఆయనకు స్థాన భ్రంశం కల్పించడంతో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అన్న చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర కాలం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. అలాంటి వేళ.. ఆకస్మాత్తుగా గవర్నర్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో అదీ ఇటీవలే పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించడం పట్ల.. పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది... ఈ కేసులో పాత్రదారులు ఎవరన్నది తెలిసినా.. సూత్రధారులు సైతం బయటకు వచ్చే సమయం అసన్నమైందని అంటున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్... జగన్ ప్రభుత్వం మధ్య ఎక్కడ ఎలాంటి పొరపొచ్చలు లేవనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలంటూ.. ఉద్యగ సంఘం నాయకుడు సూర్యనారాయణ... రాజ్‌భవన్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించి రావడం.. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొనడం.. ఆ తర్వాత గవర్నర్‌తో భేటీకి ఉద్యోగ సంఘం నాయకుడికి అపాయింట్‌మెంట్ ఎవరు ఇప్పించారంటూ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి ఆరా తీయడం.. ఆ తర్వాత గవర్నర్ కార్యదర్శి ఆర్పీ సిసోడియాపై బదిలీ వేటు పడిందనే ఓ చర్చ వాడి వేడిగా సాగింది. అలా గవర్నర్ కార్యదర్శి బదిలీ అయిన కొద్ది రోజులకే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా బదిలీ కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాశమైంది. కానీ గవర్నర్ బదిలీ ఇంత ఆకస్మాత్తుగా జరుగుతుందని ఎవరూ అసలు ఊహించలేదు.
అదీకాక... పక్కనే ఉన్న తెలంగాణలో గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్‌కు సీఎం కేసీఆర్ మధ్య అగాధం నెలకొన్న సంగతి విదితమే. గవర్నర్, బీఆర్ఎస్ సర్కార్ మధ్య విభేదాలు బహిరంగ రహస్యమే. గవర్నర్ ప్రభుత్వ వైఖరిని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ మంత్రులు కూడా గవర్నర్ పై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.
తెలంగాణలో గవర్నర్‌కు, సీఎం కేసీఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోన్నా.. ఆ రాష్ట్రంలో గవర్నర్ జోలికి వెళ్లకుండా.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను బదలీ చేయడం పలు ప్రశ్నలకు తావిచ్చింది. ఆయోధ్య తీర్పు వెలువరించిన అయిదుగురు జడ్జిల ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తి, అలాగే ట్రిపుల్ తలాక్ చెల్లదని తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూడా జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏపీ గవర్నర్ గా నియమితులు కావడంతో ఏపీ విషయంలో బీజేపీ వ్యూహం ఏమిటి? వైఖరి ఏమిటి? ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో కేంద్రం పార్లమెంటు వేదికగా తన వైఖరి ప్రకటించడం, అలాగే ఈ నెలాఖరులో సుప్రీం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కొత్త గవర్నర్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.