ఉభయ తారకం
posted on Feb 11, 2023 @ 3:29PM
ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ తీరేమిటో? వైఖరి ఏమిటో అంతుబట్టని విధంగా ఉంది. ఏ విధంగా చూసుకున్న ఏపీలో బీజేపీకి ఇసుమంతైనా బలం లేదు. అయిన దానికీ కాని దానికీ మీడియా ముందుకు వచ్చి పాండిత్య ప్రదర్శన చందంగా ఏవో మాటలు మాట్లాడే ఒకరిద్దరు నేతలు తప్ప బీజేపీకి రాష్ట్రంలో నాయకత్వం అన్నది దాదాపు పూజ్యం. అదే విధంగా జనాదరణ విషయంలో కూడా ఆ పార్టీ పరిస్థితి చెప్పుకోవడానికి ఏమీ లేదన్న చందంగానే ఉంది. తెలుగుదేశంతో పొత్తు లేని ఏ సందర్భంలోనూ ఆ పార్టీ ఏపీలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలుచుకున్న దాఖలాలు లేవు. తగుదునమ్మా అని ఇటీవలి కాలంలో ఒంటరిగా పోటీ చేసిన ఉప ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి బీజేపీది. అలాంటి బీజేపీ ఏపీలో వేగంగా సంభవిస్తున్న రాజకీయ పరిణామాల పట్ల ఎందుకు అంత ఉదాశీనంగా ఉంటుందన్నది పరిశీలకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. గత ఎన్నికలలో ఒంటరిగా పోటీలోకి దిగిన బీజేపీ ఏపీలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కారణాని ఏపీలో జరిగే ప్రతి అంశంలోనూ ఆ పార్టీ తీరేమిటన్నదే ప్రాధాన్యతా అంశంగా మారిపోయింది.
అలాంటి ప్రతి ప్రాధాన్యత అంశంలోనూ బీజేపీ వ్యవహార తీరు తామరాకు మీద నీటుబొట్టు చందంగానే ఉంది. మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం తీరుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదా అన్న అనుమానాలు కలిగేలా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. తీరా పార్లమెంటు వేదికగా విషయం తేల్చాల్సి వచ్చే సరికి జగన్ సర్కార్ ను నట్టేట్లో ముంచింది. ఇలా ఏ విషయం తీసుకున్నా.. ఏపీ విషయంలో బీజేపీ ఆలోచన ఏమిటి? తీరేమిటి? అసలు ఏపీ విషయంలో ఆ పార్టీకి ఉన్న ఆశలేంటి? రాజకీయంగా ఏపీ నుంచి ఆ పార్టీ ఆశిస్తున్నదేమిటి? అన్న ప్రశ్నలకు తలలు పండిన రాజకీయ పండితులు కూడా తలలు బద్దలు కొట్టుకునేంత మిస్టీరియస్ గా వ్యవహరిస్తోంది. రాజకీయంగా ఏపీలో బీజేపీకి జనసేన మిత్రపక్షం. అదే సమయంలో తెలుగుదేశం వైరి పక్షం. గత ఎన్నికలు ముందు దాకా ఎన్డీయే భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం.. ఆ తరువాత ఏపీ విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ తెగతెంపులు చేసుకుంది. అప్పటి నుంచీ ఇరు పార్టీల మధ్యా వ్యవహారం ఉప్పు, నిప్పుగానే ఉంది. కానీ మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వేడి రాష్ట్రంలో రాజుకోవడం ఆరంభించేసరికి బీజేపీకి తెలుగుదేశం విషయంలో పరస్పర రాజకీయ ప్రయోజనాలు గుర్తుకు వచ్చాయి. కేంద్రంలో అధికారం పదిలం చేసుకోవాలంటే.. అంటే మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించాలంటే.. ప్రతి పార్లమెంటు సీటు ప్రధానమే అన్న విషయం గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆ పార్టీ భారీగా ఆశలు పెట్టుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ప్రస్తుతం తమ అధీనంలో అంటే తాము అధికారంలో ఉన్న కర్నాటకలో మరో సారి అధికారం చేజిక్కించుకోవాలంటే అద్భుతం జరగాలన్న విషయం ఆ పార్టీకి అవగతమైంది. ఆ రాష్ట్రంలో లోక్ సభ స్థానాలలో విజయం కూడా కష్టమేనని అర్ధమైంది. అందుకే బీజేపీ తెలంగాణపై బాగా ఆశలు పెంచుకుంది. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ అధికారం ఎటూ చాన్స్ లేని విషయమే కావడంతో, ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ తో పొత్తు పెట్టుకుంటే.. పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీల మద్దతు పొందే అవకాశం ఉంటుందన్నది ఆ పార్టీ వ్యూహం, ఆశ, ఆలోచన. ఆ విధంగా చూస్తే.. ఏపీలో పొత్తల విషయంలో ఆ పార్టీ ఒకింత చురుకుగా, జోరుగా, కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అందుకు భిన్నంగా బీజేపీ ఏపీ విషయంలో అనుసరిస్తున్న నిర్లిప్త, ఉదాశీన వైఖరి ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో ఎంతో కొంత జనాదరణ ఉన్న జనసేనతో మైత్రీ బంధంలో ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలోనే అపార అభిమాన జన సందోహం ఉంది. మరో వైపు రాష్ట్రంలో ప్రధాన విపక్షం తెలుగుదేశం మాజీ మిత్రపక్షం. ఆ పార్టీకి రాష్ట్రంలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. పటిష్ట నిర్మాణం ఉంది. జగన్ సర్కార్ ను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉంది. బీజేపీ ప్రస్తుత మిత్ర పక్షం జనసేన, మాజీ మిత్రపక్షం తెలుగుదేశం వచ్చే ఎన్నికలలో కలిసి అడుగులు వేయడానికి ఇప్పటికే దాదాపుగా ఒక అవగాహనకు వచ్చేశాయి.
ఈ పరిస్థితుల్లో కూడా బీజేపీ ఉదాశీనంగా వ్యవహరించడం పట్ల రాజకీయవర్గాలలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికలలో బీజేపీ వ్యూహంపై పలు విశ్లేషణలకు తావిచ్చింది. అసలింతకీ బీజేపీ జనసేన, తెలుగుదేశం పొత్తు విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అధికార వైసీపీతో అవగాహనతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉండగా, బీజేపీ వైసీపీతో జట్టు కట్టడం రాజకీయంగా ఏమంత ప్రయోజనం ఉండదని బీజేపీ శ్రేణులే చెబుతున్నాయి.
అదీకాక ఏపీలో తెలుగుదేశం కు వ్యతిరేకంగా వెళితే ఆ ప్రభావం తెలంగాణలో బీజేపీపై పడుతుందన్న భావన కూడా బీజేపీ అగ్రనేతల్లో ఉంది. అందుకే ఉభయ తారకంగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ ప్రేక్షక పాత్రకే పరిమితం అయితే బెటర్ అన్న అభిప్రాయం ఆ పార్టీ టాప్ బ్రాస్ లో కనిపిస్తోంది. అంటే ఏపీ రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా, బీజేపీ మాత్రం జనసేనతో తన మిత్రత్వాన్ని వదులు కోదు. అంతే కాకుండా పొత్తులో భాగంగా తెలుగుదేశం, జనసేనల సీట్ల సర్దుబాటులో జనసేన కోటాకు వచ్చిన సీట్లలో రెండో మూడో తనకు దక్కేలా జనసేనతో బీజేపీ అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉంది. అలాగే ఒకటో రెండో పార్లమెంటు సీట్లను కూడా కోరే అవకాశం ఉంది. ఈ ఏర్పాటు వల్ల తెలంగాణ ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం మద్దతు కమలం పార్టీకి లభిస్తుంది. ప్రస్తుతానికైతే బీజేపీ గేమ్ ప్లాన్ ఇదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.