మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం!
posted on Jun 24, 2024 @ 9:42AM
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం (జూన్ 24) భేటీ అవుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ భేటీలో చర్చించే అంశాలేమిటి? తీసుకునే నిర్ణయాలేమిటి? ముఖ్యంగా జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడి, జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఆయన తొత్తులుగా పని చేసి ప్రత్యర్థులపై అక్రమ కేసులు, వేధింపులు, దాడులతో చెలరేగిపోయిన అధికారులపై చర్యలకు సంబంధించి చర్చ జరుగుతుందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
అదే విధంగా లోకోష్ రెడ్ బుక్ ఆధారంగా చర్యలకు ఉపక్రమించే అంశంపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు.. జగన్ హయాంలో భ్రష్టపట్టిపోయిన వివిధ శాఖల ప్రస్తుత పరిస్థితిపై శ్వేత పత్రాల విడుదలకు సంబంధించి కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసిన తొలి ఐదు సంతకాలపై చర్చించి వాటికి కేబినెట్ ఆమోదం తెలుపుతుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, అలాగే నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐదు అంశాలకూ కేబినెట్ తొలి భేటీలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటికి అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పోలవరం, అమరావతిలో పర్యటించారు. ఇప్పుడు కేబినెట్ భేటీలో పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని అంటున్నారు.