జగన్ ఘనత..అప్పుల్లో ఏపీ టాప్
posted on Jun 24, 2024 @ 10:34AM
ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోనూ అధోగతి పాలు చేసేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టాప్ లో నిలిపారు. ఆయన మాత్రమే సాధించగలిగిన ఘనత ఇదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ జగన్ ఏపీని అగ్రస్థానంలో నిలిపింది అప్పుల్లో. ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రస్తుతం 14 లక్షల కోట్లపైనే ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
ఈ అప్పులకు వడ్డీయే రోజులు దాదాపు 300 కోట్ల రూపాయలు అంటే జగన్ ఆర్థిక విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది. సంసద సృష్టి, అభివృద్ధి, పురోగతి అన్న మాటలకే అర్ధం తెలియని జగన్.. తన పాలనా కాలమంతా అప్పులు చేసి తన కోసం ప్యాలస్ లు నిర్మించుకోవడమే పాలనా భావించారు. అలాగే అరకొర సంక్షేమానికి, ఉద్యోగుల వేతనాలకు కూడా జగన్ అప్పుల మీదే ఆధారపడ్డారు. మద్యం ఆదాయాన్ని పాతికేళ్లకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. అడ్డగోలుగా నిబంధనలు ఉంటాయన్న విషయాన్నే విస్మరించి అప్పు చేయడమో గొప్ప అన్నట్లుగా ఎడా పెడా అప్పులు తెచ్చేశారు.
జగన్ ఏడాదిలో పదకొండు నెలలు అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపారంటే.. ఆయన ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అవగతమౌతుంది. దాదాపు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తుంది. ఇందు కోసం రాష్ట్ర ఆదాయం, కేంద్ర గ్రాంట్లపై ఆధారపడుతుంది. అవి సరిపోనప్పుడు మాత్రమే అప్పులు చేస్తుంది. అయితే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల నుంచి ఆదాయం వస్తుంది. అది చేసిన అప్పులు తీర్చడానికి, సంక్షేమ పథకాల అమలుకు వినియోగిస్తుంది.
రాబడి ఆధారంగా మాత్రమే ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయడానికి సాహసిస్తుంది. అయితే జగన్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా అసలు ఆదాయం అనేదే లేకుండా చేసుకుని ప్రభుత్వ రోజు వారి కార్యకలాపాల నిర్వహణకు కూడా అప్పులపైనే ఆధారపడింది. తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించడానికి కూడా అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారంటే జగన్ సర్కార్ ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్థంగా ఉందో అర్ధమౌతుంది.