నమ్మిన వారందర్నీ నట్టేట ముంచిన జగన్!
posted on Jun 24, 2024 9:23AM
పాము తన పిల్లల్ని తానే తినేస్తుందంటారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ రెడ్డి మాత్రం అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించారు. ఆయన తన కోసం తన చేత, తానే నియమించుకున్న వాలంటీర్లను నడిరోడ్డుమీదకు లాగి చోద్యం చూస్తున్నారు.
చట్ట బద్ధత, ఉద్యోగ భద్రత లేని వాలంటీర్ వ్యవస్థను సృష్ఠించి, అదే ప్రభుత్వోద్యోగమని నమ్మించి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలను ఆ పోస్టులలో నియమించారు. అలా నియమించి గత ఐదేళ్లుగా అంటే తాను ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ పార్టీ ప్రచారం, పార్టీ పనులే వారి ఉద్యోగ ధర్మం, కర్తవ్యం అన్నట్లుగా వాడేసుకున్నారు. తీరా ఎన్నికల ముందు.. వాలంటీర్లు ఎన్నికల విధులలో ఉండేందుక వీల్లేదని ఎన్నికల సంఘం విస్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో.. వాటంటీర్లపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువచ్చి, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అప్పుడు మళ్లీ మీ ఉద్యోగాలు మీకిచ్చేస్తానంటూ నమ్మబలికి బలవంతంగా వారి చేత రాజీనామాలు చేసేశారు.
జగన్ మాటలు విశ్వసించని కొందరు వాలంటీర్లు రాజీనామాకు ససేమిరా అన్నారు. అయితే జగన్ మాటలు నమ్మో, వైసీపీ నేతల ఒత్తిళ్లు, బెదరింపులను భయపడో రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఎనిమిది వేల మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వారంతా ఇప్పుడు లబోదిబో మంటున్నారు. అంతేనా ఐదేళ్ల పాటు అరవ చాకిరీ చేయించుకుని ఇప్పుడు ఇలా నడిరోడ్డున వదిలేసిన జగన్ పై తిరగబడుతున్నారు. తమపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా రాజీనామాలు చేయించిన వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. దీంతో జగన్ తప్పుకు ఆయనతో అంటకాగిన, ఆయన కోసం పని చేసిన వైసీపీ నేతలూ ఇక్కట్లలో ఇరుక్కున్నారు. తన కోసం జగన్ నియమించుకున్న వాలంటీర్లు, జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచీ ఆయన కోసమే పని చేసిన కార్యకర్తలు, నాయకులు ఇలా అందరూ కూడా ఇప్పుడు జగన్ తప్పిదాలకు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఇరుక్కున్నారు.
జగన్ స్వార్థం, అనాలోచిత నిర్ణయాలు, అస్తవ్యస్త విధానాల కారణంగా ఇపుడు మొత్తం వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జగన్ కు అడుగులకు మడుగులొత్తిన అధికారులు, ఆయన కోసం ప్రత్యర్థులపై దూషణలు, దాడులతో చెలరేగిపోయిన నేతలు, జీతం తక్కువ అయితేనేం ఉన్న ఊళ్లో పని చేసుకోవడానికి ఉద్యోగం దొరికింది అదే పదివేలు అనుకున్న కార్యకర్తలు ఇలా జగన్ తనను నమ్మిన, నమ్ముకున్న వారందరినీ నట్టేటముంచారు.