మోదీకి మూడినట్టేనా? కాషాయం కనుమరుగేనా?
posted on May 5, 2021 @ 4:52PM
బెంగాల్‌లో బేజార్. కేరళలో ఖతం. తమిళనాడులో తుస్. ఇటీవల ఎన్నికలు జరిగిన మూడు పెద్ద రాష్ట్రాల్లో బీజేపీని బండకేసి కొట్టారు ఓటర్లు. ఉప ఎన్నికలు జరిగిన ఏపీ, తెలంగాణలోనూ కమలం పార్టీ ఖల్లాస్. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని స్థానిక సంగ్రామంలోనూ బీజేపీ ఘోర పరాజయం పాలైంది.
యూపీలో బీజేపీ అధికార పార్టీ. ఆ యూపీ దయ వల్లే మోదీ రెండుసార్లు ప్రధాని కాగలిగారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడం కమలనాథులను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రధాన మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో.. 40 జిల్లా పంచాయతీ స్థానాలుంటే అందుకే కేవలం 8 సీట్లకే బీజేపీ మద్దతుదారులు పరిమితమవడం ఆ పార్టీపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు నిదర్శనం. ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలోనూ సేమ్ సీన్. 40 సీట్లలో బీజేపీ కేవలం 6 చోట్ల మాత్రమే గెలువ గలిగింది. అంటే, హిందుత్వ నినాదం నుంచి ప్రజలు దూరం జరుగుతున్నట్టేనా? రాజకీయంగా కీలకమైన వారణాసి, అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం దేనికి సంకేతం? ప్రధాని మోదీ ప్రాభవం అధఃపాతాళానికి పడిపోతోందా? దేశ వ్యాప్తంగా కమల వికాసం మసకబారుతోందా?
అటు.. కర్ణాటకలోనూ అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమై పరువు పోగొట్టుకుంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది. బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే బళ్లారి కార్పొరేషన్ సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బళ్లారిలో గాలి సోదరులకు గట్టి షాక్ తగిలింది.
దక్షిణాదిన కర్ణాటకలోనే ఎంతోకొంత బలమున్న బీజేపీ ఇప్పుడు అక్కడ కూడా చతికిల పడుతోంది. మోదీ ఇమేజ్ డ్యామేజ్ అవడమే ఇందుకు కారణం అంటున్నారు. దక్షిణాదిన ఇప్పట్లో పువ్వు గుర్తు అధికారంలోకి రాలేదని.. తాజా ఎన్నికలతో తేలిపోయింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫలితాలతో.. ఇక సౌత్‌పై కాషాయం ఆశలు వదులు కోవాల్సిందే.
అటు, ఉత్తరాదిలోనూ బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గెలుస్తామనుకున్న బెంగాల్‌లో.. బెంబేలెత్తిపోయింది బీజేపీ. మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాలు.. ముగ్గురూ కలిసి దాదాపు 100 వరకూ ఎన్నికల ర్యాలీలు నిర్వహించగా.. జస్ట్, వీల్ ఛైయిర్‌లో కూర్చొని, తనపై దండెత్తి వచ్చిన కమలదండును దంచికొట్టింది దీదీ. బెంగాల్ టైగర్ పంజా దెబ్బకు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. మమత బలమెంతో కమలనాథులకు తెలిసొచ్చేలా చేసింది.
యూపీలోనూ కాషాయం వెలవెలపోతోంది. హిందుత్వ నినాదం పాత చింతకాయ పచ్చడిగా మారింది. మోదీ మాటలను, యోగి చేష్టలను.. ఎల్లప్పుడూ నమ్మే పరిస్థితి లేదు. యూపీ పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పరాభవ బారంతో కుమిలిపోతున్నారు కాషాయ శ్రేణులు. ఇక, ఢిల్లీలో కేజ్రీవాల్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. పంజాబ్‌లో కెప్టెన్ సాబ్ కర్చీఫ్ వేసుకున్నారు. రాజస్థాన్, గుజరాత్‌లో 50-50. మహారాష్ట్రలో శివసేన పాగా. ఇలా లెక్కేస్తూ పోతే.. చిన్నా చితకా రాష్ట్రాలే కమలం ఖాతాలో కనిపిస్తున్నాయి. పెద్ద రాష్ట్రాలన్నీ ప్రాంతీయ పార్టీలో జాబితాలో చేరిపోయాయి. మరో ఏడెనిమిది నెలల్లో జరగాల్సిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికలు.. వచ్చే ఏడాది ఆఖర్లో జరగాల్సిన హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మోదీ, అమిత్ షా నాయకత్వానికి మరింత అగ్నిపరీక్షగా మారతాయనడంలో సందేహం లేదు.
మాటలు తప్ప మోదీ చేసేదేమీ లేదనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన విభజన హామీలేవీ నెరవేర్చనప్పుడే మోదీ మాట మీద నిలబడే మనిషి కాదని తేలిపోయింది. అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నా మౌనంగా ఉంటుండటం ఆయన హోదాకే మచ్చ తెస్తోంది. ఇక, ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో మోదీ అవలంభిస్తున్న ఉదాసీన వైఖరి విమర్శల పాలవుతోంది. దేశ ప్రజల ప్రాణాలు బలిపెట్టి.. వ్యక్తిగత ఇమేజ్ కోసం.. విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేశారనే అపవాదు ఆయన్ను వెంటాడుతూనే ఉంది. వీడియో ప్రసంగాలు మినహా.. కొవిడ్ కట్టడికి ప్రధాని చేసిందేమీ లేదనే అభిప్రాయం దేశ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే, ఎక్కడ, ఎలాంటి ఎన్నికలు జరిగినా.. వాటిలో బీజేపీకి పరాభవమే ఎదురవుతోంది. యావత్ దేశాన్ని కాషాయమయం చేయాలనే కమలనాథుల కల.. కల్లే కానుంది. యావత్ దేశం నుంచి కాషాయ పార్టీ తుడుచుకుపెట్టుకు పోయే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు మోదీ.. ఒట్టి మాటలు కట్టిపెట్టి.. గట్టి మేలు తలపెట్టవోయ్...