పీఎంవో వేస్ట్.. గడ్కరీ బెస్ట్! బీజేపీ నేత సంచలనం
posted on May 5, 2021 @ 4:24PM
దేశంలో కరోనా మహ్మమారి పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ లో దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ అందుక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లోని హాస్పిటల్స్ లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం వల్లే దేశంలో కరోనా విజృంభిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని అంతర్జాతీయ మీడియా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తోంది. మన దేశంలోని విపక్షాలు మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. తాజాగా మోడీపై సొంత పక్షం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర సర్కార్ తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా బాధ్యతల నిర్వహణకు సంబంధించి ప్రధాని కార్యాలయంపై ఆధారపడటం అనవసరమని.. ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలని చెప్పారు. పీఎంఓపై ఆధారపడటం దండగని అన్నారు సుబ్రహ్మణ్యస్వామి.
అయితే తాను కేవలం ప్రధాని కార్యాలయాన్నే విమర్శిస్తున్నానని... ప్రధాని మోదీని కాదని వివరణ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు. హర్షవర్ధన్ తన అధికారాలను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఉందని చెప్పారు. గడ్కరీతో కలిస్తే హర్షవర్ధన్ విజయవంతమవుతారని అన్నారు. మన దేశం మరో కరోనా వేవ్ ను ఎదుర్కోబోతోందని స్వామి హెచ్చరించారు. ఈ వేవ్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతోందని... ప్రతి ఒక్కరు కట్టుదిట్టమైన జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు సుబ్రహ్మణ్యస్వామి.