ఏపీకి ప్రత్యేకహోదా వీలుపడదు: ప్లానింగ్ కమీషన్
posted on Jun 13, 2014 @ 5:35PM
రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాల చితికిపోయున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు రాష్ట్రానికి ఐదేళ్ళ పాటు ప్రత్యేకహోదా ఇస్తున్నట్లు ఇంతకుముందు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వము కూడా ప్రకటించాయి. యూపీయే ప్రభుత్వమే ఆ ప్రతిపాదనను మార్చి రెండున ప్రణాళికా సంఘానికి పంపింది. కానీ మధ్యలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రణాళికా సంఘం ప్రకటన చేయలేకపోయింది. ఇప్పుడు అటువంటి సమస్యలేదు గనుక త్వరలోనే ప్రకటన వెలువడుతుందని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన రోజునుండి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కలుగజేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ప్రణాళికా సంఘం నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా పొందేందుకు తగిన అర్హతలేదని అందువలన ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ప్రధాని నరేంద్ర మోడీకి తేల్చి చెప్పినట్లు తాజా సమాచారం. ఈ ప్రత్యేకహోదా కోసం బీహార్, రాజస్థాన్, ఓడిశా, ఛత్తిస్ ఘర్, ఝార్ఖండ్ రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. తాజాగా ఆంధ్ర, తెలంగాణాలు కూడా ఆ జాబితాలో చేరాయి. జాతీయ అభివృద్ధి కౌన్సిల్ (యన్.డీ.సి.) నియమ నిబందనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వీలు కుదరకపోతే కేంద్రం నుండి భారీగా నిధులు, పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు వంటివి కేటాయించడం సాధ్యం కాదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటే, ప్రధానమంత్రి నేతృత్వంలో మొత్తం అందరు కేంద్రమంత్రులు మరియు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన యన్.డీ.సి. కమిటీ ఆమోదం తెలుపవలసి ఉంటుంది. ప్రధాని, కేంద్రమంత్రులు దానికి ఆమోదం తెలుపవచ్చునేమో కానీ ప్రత్యేకహోదా కోరుతున్న మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా కేసీఆర్ అందుకు అంగీకరిస్తారనే నమ్మకం లేదు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందలేక పోవచ్చును.
అందువల్ల ప్రధాని మోడీ వేరే ఇతర మార్గం ద్వారా రాష్ట్రానికి సహాయా సహకారాలు అందించ వలసి ఉంటుంది. లేదా ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేసి కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది. అయితే మరి ఈవిషయం ఇంకా చంద్రబాబు చెవిన పడిందో లేదో తెలియదు కానీ నిన్న మంత్రివర్గం సమావేశంలో రాష్ట్రానికి మరో పదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసినట్లు చెప్పారు.