ప్రత్యేక హోదాపై మళ్ళీ కొత్తగా హామీలేల?
posted on Aug 17, 2015 @ 11:18AM
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమయిన, అర్హతలు, లక్షణాలు లేని కారణంగానే 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరం చెపుతోందని, అందుకు ప్రత్యమ్నాయంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకప్యాకేజి ఇవ్వడానికి ఆర్దికశాఖ యోచిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ ఉపకార్యదర్శి ఆశిష్ దత్త వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వ్రాసిన ఒక లేఖలో తెలిపారు. రెండు నెలల క్రితం ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి వ్రాసిన లేఖకు జవాబిస్తూ ఆశిష్ దత్త ఈ లేఖ వ్రాసారని వైకాపా ఎంపీ మిదున్ రెడ్డి తెలిపారు. అదే నిజమయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని స్పష్టం అవుతోంది.
కానీ ప్రత్యేక హోదా అంశంపై ఉద్దేశ్య పూర్వకంగానే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిల్లీకి రమ్మని ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారని, అటువంటప్పుడు ప్రత్యేక హోదా రాదని వైకాపా ముందే ఎందుకు దుష్ప్రచారం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. తన రాజకీయ లబ్ది కోసమే ప్రత్యేక హోదా కోసం డిల్లీలో ధర్నా చేసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ రాష్ట్రానికి వచ్చి ప్రత్యేక హోదా రాదని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తప్పకుండా సాధిస్తామని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో వైకాపా, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదనే విషయాన్ని కేంద్రప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు తెలియజేసింది. కనుక ఆశిష్ మిత్రా వ్రాసిన లేఖ కూడా అదే విషయాన్ని మరోమారు దృవీకరిస్తున్నట్లు భావించవచ్చును. అటువంటప్పుడు వైకాపాని విమర్శించే ప్రయత్నంలో జూపూడి ప్రభాకరరావు ప్రత్యేక హోదా తప్పకుండా సాధిస్తామని మళ్ళీ కొత్తగా హామీ ఇచ్చి ఒకవేళ సాధించలేకపోతే దాని వలన ఏపీ ప్రభుత్వం, తెదేపాయే మరింత ఇబ్బందిపడవలసి ఉంటుందని గ్రహించాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 20న ప్రధాని నరేంద్ర మోడీతో దీని గురించే ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదాతో బాటు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజి కూడా అడగాలని ఆయన భావిస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రాష్ట్రంలో రాజకీయ సవాళ్ళను, విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగని ఈ వ్యవహారాన్ని ఇంకా నాన్చడం వలన రెండు పార్టీలు మరింత నష్టపోవలసి వస్తుంది. కనుక ప్రధాని నరేంద్ర మోడీ-చంద్రబాబు నాయుడుల మధ్య త్వరలో జరుగబోయే సమావేశంలో దీనిపై ఒక ఖచ్చితమయిన నిర్ణయం తీసుకోవడం అత్యవసరం. లేకుంటే ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి లాభం కలగడం సంగతి ఎలా ఉన్నా దానిని ఒక రాజకీయ అంశంగా మలుచుకొన్న రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అది చాలా లబ్ది చేకూర్చడం ఖాయం.