మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ కి తప్పులే దొరకలేదా?
posted on Aug 16, 2015 @ 12:41PM
ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ఎర్రకోటపై నుండి ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన తన ప్రసంగాన్ని రాజకీయ కాటాలో తూచి చూడవద్దని మీడియా, రాజకీయ పండితులకు, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసారు. అంటే ప్రధాని తన ప్రసంగంలో ఆనవాయితీగా కొన్ని సంక్షేమ, అభివృద్ధి పధకాలను ప్రకటించడం, దేశ ప్రజలను మెప్పించేందుకు కొన్ని వరాలు ప్రకటించడం, ఇంతవరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, ఇక ముందు చేయబోయే వాటి గురించి ఆయన చెప్పుకొంటే వాటిపై మీడియా, రాజకీయ పండితులు రాజకీయ విశ్లేషణలు చేయడం, ప్రతిపక్షాలు ప్రధాని ప్రసంగంలో పస లేదని తేల్చి పడేయడం సర్వసాధారణమయిన విషయమే. అందుకే ఆయన తన ప్రసంగాన్ని ఆ రాజకీయ కాటాలో తూచి చూడవద్దని విజ్ఞప్తి చేసారు. కానీ అంతమాత్రన్న ఆయన ప్రసంగాన్ని విశ్లేషించకుండా, విమర్శలు గుప్పించకుండా ఎవరూ విడిచిపెట్టబోరు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ ఆయన ప్రసంగంపై ప్రతిస్పందించేందుకు నిరాకరించడం విశేషం. బహుశః మోడీ ప్రసంగంలో తప్పులు ఏరిపెట్టడానికి వారి రాజకీయ సలహాదారులు మరికొంత సమయం కోరారేమో? కానీ మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ మోడీ ప్రసంగంలో ఒక తప్పుని వెతికిపట్టుకొని విమర్శలు గుప్పించారు. మాజీ సైనికులకి ఒక ర్యాంక్-ఒక పెన్షన్ అమలు గురించి ఆయన ఎటువంటి హామీ ఇవ్వలేకపోయారని విమర్శించారు.
కానీ ఈ సమస్య గత అనేక ఏళ్లుగా నలుగుతోంది. ఇంతవరకు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారించకుండా నిర్లక్ష్యం వహించింది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ నిన్న తన ప్రసంగంలో ఈ సమస్యని శాస్వితంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం గట్టి కసరత్తే చేస్తోందని, త్వరలోనే దీనిని పరిష్కరించి తమ హామీని నిలబెట్టుకొంటామని, మువ్వన్నెల జెండా సాక్షిగా ప్రమాణం చేసి చెపుతున్నానని అన్నారు. కొన్ని సాంకేతిక అవరోధాల కారణంగా ఈ సమస్య పరిష్కారంలో జాప్యం జరుగోతోందని కేంద్రరక్షణ మంత్రి మనోహర్ పారేకర్ తెలిపారు.
గత పదేళ్ళలో ఈ సమస్యని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ పార్టీ, ఈ సమస్యని మోడీ ప్రభుత్వం మంత్రదండం త్రిప్పి పరిష్కరించేయాలని ఆశించడం విడ్డూరం. డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీని కోసం ధర్నా చేస్తున్న మాజీ సైనికులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ వెళ్ళినప్పుడు వారు అందుకే ‘రాహుల్ గాంధీ గో-బ్యాక్’ అంటూ నినాదాలు చేసారు. ఆయనకి జరిగిన ఈ అవమానం గురించి దాచిపెట్టుకొని, కోడి గుడ్డుకి ఈకలు పీకుతున్నట్లు ఈ సమస్య గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కానీ మోడీ తన ప్రసంగంలో దీని గురించి చాలా స్పష్టమయిన హామీ ఇచ్చారనే భావించవచ్చును. అయినప్పటికీ ఆయన ప్రసంగంలో ఏవో తప్పులు వెతికి పట్టుకొని విమర్శించాలి కనుక కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నట్లుంది.