మోడీ ప్రసంగానికి దుబాయ్ సలాం
posted on Aug 18, 2015 @ 10:15AM
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం అందరినీ సమ్మోహితుల్ని చేసింది. ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా ఉగ్రవాదం గురించే మాట్లాడటం విశేషం. ఉగ్రవాదులలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అంటూ వేరే ఉండరని అన్నారు. ఇదివరకు పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఒక మిలటరీ స్కూలు మీద దాడి చేసి 140 మంది పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపినప్పుడు తీవ్రంగా చలించిపోయిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ మాట అన్నారు. మోడీ అదే మాటని మళ్ళీ నిన్న ప్రసంగంలో ప్రస్తావించడం ద్వారా పాక్ ప్రభుత్వానికి, ప్రధానికి వారు ఉగ్రవాదులను ఉపేక్షిస్తున్న సంగతిని మరొక్కమారు గుర్తు చేసినట్లయింది. ఉగ్రవాదంపై పోరులో పాక్ ప్రభుత్వం తమతో కలిసి వస్తుందో లేదో ఆ దేశమే తేల్చుకోవాలని చెప్పారు.
భారత్ కి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నాగా ల్యాండ్ రాష్ట్రంలో నాగా వేర్పాటువాదులు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ళుగా ఏ ప్రభుత్వం పరిష్కరించని ఆ సమస్యని తమ ప్రభుత్వం శాశ్వితంగా పరిష్కరించి వారిని కూడా భారత్ తో అనుసంధానం చేయగలిగామని మోడీ తెలిపారు. కొందరు పదేళ్ళు పోరాడుతారు..మరికొందరు 20 ఏళ్ళు, ఇంకొందరు 40ఏళ్ళు పోరాడవచ్చును..కానీ చివరికి చర్చల ద్వారానే వారి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. నాగాల విషయంలో అది మరొకమారు రుజువయిందని ఆయన చెప్పినప్పుడు సభకి హాజరయిన ప్రవాస భారతీయులు అందరూ చప్పట్లుకొడుతూ తమ హర్షం ప్రకటించారు.
ఒక్క నాగాలే కాదు ఉగ్రవాదులయినా, వేర్పాటువాదులయినా తమ హింసావాదాన్ని వీడి మానవతావాదంతో జనజీవన స్రవంతిలో కలిసినప్పుడే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ తో బాటు, జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదులకు ఆయన ఈ సూచన చేశారని అర్ధమవుతోంది.
మోడీ ప్రసంగంలో విశేషం ఏమిటంటే ఆయన సగటు రాజకీయ నాయకుడులాగ ఊక దంపుడు ఉపన్యాసాలు చేయకుండా తను చెప్పదలచుకొన్న విషయాన్ని ప్రజల మనసులలోకి చొచ్చుకుపోయేలా చెప్పగలరు. అఫ్ఘనిస్తాన్ తిరిగి తన కాళ్ళ మీద తను నిలబడేందుకు ఆ దేశానికి భారత్ ఎల్లపుడు సహాయపడుతూనే ఉందని ఆయన చెప్పారు. కానీ దానికి ఆయన జోడించిన చిన్న సెంటి మెంటు సభకు వచ్చినవారిని మంత్రం ముగ్ధులను చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ‘కాబూలీవాలా’ తో మనకున్న ఆత్మీయ అనుబంధమే ఆ దేశాన్ని మనకి దగ్గరకి చేసింది. కష్టాలలో ఉన్న మన ఆ కాబూలీవాలా స్నేహితుడిని ఆదుకోవడం మన ధర్మం. అందుకే ఆదుకొంటున్నాము,” అని చెప్పినప్పుడు సభలో ఉన్నవారు చప్పట్లతో ఆయనను అభినందించారు.
అదేవిధంగా “భారత్-దుబాయ్ ల మధ్య 700 విమానాలు తిరుగుతున్నాయని, కానీ ఒక భారత ప్రధాని దుబాయ్ రావడానికి 54సం.లు పట్టిందని, అయినప్పటికీ దుబాయ్ రాజుగారు తమని చాలా ఆదరించారని, భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కూడా అంగీకరించారని అందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామని చెప్పినప్పుడు సభకు వచ్చిన భారతీయులందరూ హర్షాతిరేకాలతో చప్పట్లు కొట్టారు.
ఆయన తన ప్రసంగం ముగించే ముందు ఆయన అన్న మాటలు వింటే ఆయన ఎంత గొప్ప వక్తో అర్ధమవుతుంది. “ప్రపంచంలో చాలా దేశాలలో భారతీయులు పనిచేస్తున్నారు. వారిని నేను కలుస్తున్నప్పుడు వారి పాస్ పోర్ట్ రంగు చూడను...వారి ప్రాంతం, మతం నేను చూడను. మనందరిలో ప్రవహించేది ఒకే రక్తం...అది చాలు వాళ్ళు మనవాళ్ళే అని గుర్తించడానికి,” అని ఆయన అన్నప్పుడు ప్రవాస భారతీయులలో ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందో ఊహించవచ్చును.
ఇరుగు పొరుగు దేశాలన్నిటితో భారత్ ఎప్పుడూ స్నేహమే కోరుకొంటుందని కానీ పాకిస్తాన్ మాత్రం అందుకు సహకరించకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. పాకిస్తాన్ కలిసి రానంత మాత్రాన్న శాంతి స్థాపనకు, అభివృద్ధికి తను చేస్తున్న ప్రయత్నాలు విరమించబోనని, ఇప్పటికే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ లతో భారత్ అనేక ఒప్పందాలు కుదుర్చుకొని నాలుగు దేశాల మధ్య బంధాలు బలపరుచుకొందని మున్ముందు సార్క్ దేశాలన్నిటితో తమ స్నేహ సంబంధాలను పటిష్టం చేసుకొంటూ సార్క్ దేశాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు తను గట్టిగా కృషి చేస్తున్నానని మోడీ తెలిపారు. ఇదంతా చూస్తూ కూడా పాక్ ఇంకా ఉగ్రవాదాన్నే అంటిపెట్టుకొని ఉండిపోతుందో లేక తన దేశాభివృద్ధి కోసం తమతో చేయిచేయి కలిపి పనిచేయడానికి ముందుకు వస్తుందో పాక్ పాలకులే తేల్చుకోవాలని చెప్పారు. త్వరలో భారత్ ఒక శాటిలైట్ అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుందని, దాని సేవలను సార్క్ దేశాలన్నీ ఉచితంగా వినియోగించుకోవచ్చని మోడీ ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ భారత్ పట్ల ఆసక్తి, ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయని, అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని భారత్ వేగంగా అభివృద్ధి చెందాలని తమ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని మోడీ తెలిపారు.
మోడీ తన ప్రసంగంలో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ప్రస్తావించి వాటికి తనదయిన శైలిలో చేప్పట్టిన పరిష్కారాల గురించి వివరిస్తున్నప్పుడు అందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నవారు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు. అటువంటప్పుడు వారు సహాయం కోసం భారత ఎంబసీకి వెళ్లి అధికారులను కలుస్తుంటారు. కానీ సామాన్య కార్మికులు ఎక్కడో ఉన్న భారత ఎంబసీకి వెళ్ళడం దాదాపు అసాధ్యమే. కనుక నెలకో, రెండు నెలలకో ఒకమారు ఎంబసీ అధికారులే భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వారి సమస్యలని అడిగి తెలుసుకొని పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేసినట్లు మోడీ చెప్పినప్పుడు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేసారు. ఈవిధంగా సమస్య చిన్నదయినా పెద్దదయినా అది తన దృష్టికి వస్తే దానిని తప్పకుండా పరిష్కరించడం తధ్యమని ఆయన మరొక్కమారు నిరూపించారు.