ఏపీ కోసం ప్రత్యేక కన్నీళ్లు కార్చుతున్న కాంగ్రెస్ పార్టీ
posted on Aug 9, 2015 @ 4:16PM
ఆనాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లక్షలాది ఆంద్రప్రదేశ్ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సుమారు రెండున్నర నెలలపాటు ఏకధాటిగా ఉద్యమించినా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కనందుకు మొసలి కన్నీళ్లు కార్చుతూ ఉద్యమిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతోందని వాదిస్తున్న కాంగ్రెస్ నేతలు అసలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తమ పార్టీ రాష్ట్రవిభజన ఎందుకు చేసింది? ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తెదేపాకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు తక్షణమే రాజీనామాలు చేయమని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆనాడు ఎందుకు రాజీనామాలు చేయలేదు? చేసినా వాటిని ఎందుకు ఆమోదింపజేసుకోలేదు?అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు.
కాంగ్రెస్ పార్టీ కేవలం తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంది తప్పకోట్లాది ప్రజల మనోభావాలను, అభీష్టాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రజల కోసం తెగ బాధపడిపోతూ మొసలి కన్నీళ్లు కార్చుతోంది! అసలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఎందుకు ప్రకటించింది అంటే దానికి రెండు కారణాలు కనబడుతున్నాయి.
1. రాష్ట్ర విభజన కారణంగా తమ పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రజలను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలోనే ఆఖరు నిమిషంలో ఈ ప్రత్యేక హోదా హామీని ప్రకటించింది. 2. ఎన్నికల తరువాత తమ పార్టీ ఎలాగూ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాదని ముందే పసిగట్టి, తరువాత అధికారంలోకి రాబోయే బీజేపీని ఇరుకున పెట్టవచ్చనే దురాలోచనతోనే సాధ్యాసాధ్యాలు తెలిసీకూడా అవేవీ పట్టించుకోకుండా పార్లమెంటులో హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ అధిష్టానానికి నిజంగా చిత్తశుద్ది ఉండి ఉంటే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా విభజన చట్టంలో చేర్పించి ఉండేది. కానీ చేర్చలేదు. రాష్ట్రవిభజన చేసేటప్పుడు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయకపోయినా, ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంలోకి రాబోయే బీజేపీని ఇరుకునపెట్టడానికే ఆనాడు నోటిమాటగా హామీ ఇచ్చి ఉండవచ్చును. కానీ అది ఊహించినట్లుగానే ఆంద్రప్రదేశ్ ప్రజలు ఆ హామీని నమ్మి దానికి ఓటేయలేదు. కానీ అది ఆశించిన రెండవ ప్రయోజనం మాత్రం ఇప్పుడు నేరవేరుతోంది. ఆనాడు చాలా ముందు చూపుతో పార్లమెంటులో ఈ ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పుడు దానికి వెంకయ్య నాయుడు చేతనే సమర్ధింపజేయించుకొనేలా జాగ్రత్త పడింది. ఇప్పుడు దానినే ఒక అస్త్రంగా మలుచుకొని బీజేపీ మీద ప్రయోగిస్తోంది.
దేశాన్ని పదేళ్ళపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాలకు కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, వాటి సాధ్యాసాధ్యాలు తెలియవని అనుకోలేము. అందుకే అది ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న ఏడు రాష్ట్రాల అభ్యర్ధనలను పట్టించుకోలేదు. కానీ ఒక్క ఆంద్రప్రదేశ్ కి మాత్రం చాలా ఉదారంగా హామీ ఇచ్చేసింది. ఇప్పుడు తను ఎలాగూ అధికారంలో లేదు కనుక ఆ హామీని అమలుచేయమని ఉద్యమిస్తూ తెదేపా, బీజేపీలను రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఈ ప్రత్యేక హోదా అంశంతో రాష్ట్రంలో జీవచ్చవంలా పడి ఉన్న తన కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకొనే ప్రయత్నం చేస్తోంది.
ఆనాడు తెలంగాణా కోసం తెలంగాణా యువకులు బలిదానాలు చేసుకొనేందుకు కారణమయిన కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ నేడు ఆంధ్రాలో యువకుల బలిదానాలకు కారణమవుతోంది. కానీ ఇప్పుడు ఆ నింద రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెదేపాపైనా, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంపైనే పడుతుంది. కనుక ఆవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలపై పైచేయి సాధించే అవకాశం ఉంది. కనుకనే ఆనాడు రాష్ట్రాన్ని, ప్రజలని పట్టించుకొని కాంగ్రెస్ నేతలు, వారి అధిష్టానం మళ్ళీ ప్రత్యేక హోదా పేరు చెప్పుకొని ఉద్యమాలు మొదలుపెట్టారు. వారి ఉద్యమానికి అప్పుడే ఒక వ్యక్తి బలయిపోయాడు. తిరుపతిలో నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన బహిరంగ సభలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన మునికోటి అనే వ్యక్తి ఈ రోజు మధ్యాహ్నం వెల్లూరు ఆసుపత్రిలో మరణించాడు.
ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత సుమారు ఆరేడు నెలలు కలుగుల్లో దాకొన్న కాంగ్రెస్ నేతలందరూ బిలబిలమంటూ బయటకువచ్చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ హడావుడి చేస్తున్నారు. కానీ వారి పోరాటం, ఆరాటం అంతా రాష్ట్రంలో తమ పార్టీని బ్రతికించుకోవడానికి, తద్వారా తమ రాజకీయ మనుగడని కాపాడుకోవడానికే తప్ప రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోతోందనీ కాదు...ప్రత్యేక హోదా కోసం అంతకంటే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. కనుక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజలపైకి విసురుతున్న ఈ ప్రత్యేక వలలో పడకుండా జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది.