త్వరలో 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ

Publish Date:Jan 10, 2026

  2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు. వాళ్ల వివరాలను రాజ్యసభ సచివాలయం బులిటెన్ ద్వారా వెల్లడించింది, వీళ్లలో దశాబ్దాలుగా పని చేసిన అనుభవఘ్నలైన నేతలు కూడా ఉన్నారు. రాజ్యసభలో ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ మధ్య కాలంలో 73 మంది ఎంపీలు సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ సభ్యుల పదవీ విరమణతో పలు రాష్ట్రాల నుంచి ఖాళీలు ఉంటాయి. ఈ 73 మంది సభ్యులలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు.  పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరి నుంచి ఐదుగురు చొప్పున సభ్యులు బయటకు వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు.  హిమాచల్‌ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వైఎస్సార్‌సీపీకి చెందిన అయోధ్య రామి రెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అలాగే టీడీపీకి చెందిన సానా సతీష్‌బాబు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నాలుగు స్థానాలూ రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలకే దక్కే అవకాశాలు న్నాయని భావిస్తున్నారు.  ఇక తెలంగాణ విషయాని కొస్తే, బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేశవరావు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కూడా పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణలో ఉన్న రెండు రాజ్యసభ స్థానాలను అధికార పార్టీ కాంగ్రెస్‌ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే త్వరలో ఖాళీ కానున్న 73 సీట్లకు ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది, ఏప్రిల్ నెలలో తొలి విడత నవంబర్ లో రెండో విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

చమురు మంటలతో పచ్చదనం పలచబడిపోతున్న కోససీమ

Publish Date:Jan 10, 2026

భూమికి పచ్చని రంగేసినట్లు హరిత శోభతో కళకళలాడే కోనసీమ ఇప్పుడు చమురు మంటల వేడి సెగలకు మాడిపోతోంది. పచ్చదనం పలచబడిపోతోంది.  కోనసీమ తీర ప్రాంతంలో అపార చమురు, సహజవాయు నిక్షేపాలున్నయన్న సంగతి వెలుగు చూసినప్పటి నుంచీ ఇక్కడి పచ్చదనానికి శాపం తగిలిందోమో అనిపిస్తుంది. ఓఎన్జీసీ చమురు, సహజవాయు అన్వేషణ ప్రారంభించిందో  అప్పటి నుంచే కోనసీమ పచ్చదనం పలచబడిపోవడం మొదలైంది. ఢ్రిల్లింగ్ పేరుతో తీర ప్రాంతంలో ఇష్టారీతిగా రిగ్గులు వేసేసిన ఓఎన్జీసీ.. అప్పటి నుంచే కోనసీమ వాసుల ఆరోగ్యంపై ప్రభావం పడటం మొదలైంది. తీర ప్రాంత గ్రామాల వారు కాలేయ సంబంధిత వ్యాధులకు గురి కావడం మొదలైంది. ఇదంతా చమురు, సహజవాయువు అన్వేషణ పేరుతో ఎఎన్జీసీ చేస్తున్న ప్రకృతి విధ్వంసం ఫలితమే అంటున్నారు వైద్య నిపుణులు, పర్యావరణ ప్రేమికులు.   సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని  పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. పచ్చని కొబ్బరి చెట్లు మూడు నాలుగు నిలువుల బొగ్గు చెట్లుగా మారిపోయాయి. కోనసీమలో భోగి మంటను ఓఎన్జీసీ ముందే వేసేసిందనీ, సంక్రాంతి పండగకు ముందు జరుపుకునే భోగి భోగభాగ్యాలను తీసుకువస్తుందంటారు. కానీ.. ఓఎన్జీసీ వేసిన ఈ భోగి మంట భోగభాగ్యాలను తుడిచేస్తోందనీ ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ఇక ఇప్పుడు ఓఎన్జీసీ ఈ బ్లోఔట్ ను ఆపడం సాధ్యం కాదని తేల్చేసింది. మంటలు ఎగసిపడుతున్న బావిని శాశ్వతంగా మూసేయడమే మర్గమని నిర్ణయించింది. మూడు దశాబ్దాల కిందట పాశర్లపూడి బ్లో ఔట్ సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు ఈ బ్లో ఔట్ సంభవించిన బావిని మూసేయాలంటే   భారీ మడ్ ఫిల్లింగ్ యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించడానికి పచ్చటి పొలాలకు అడ్డంగా భారీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ఓఎన్జీసీ ఇప్పటికే ఆ పని మొదలెట్టేసింది. మొత్తంగా కోనసీమ చమురు, సహజవాయువుల నిక్షేపాల గని అని సంబరపడటానికి లేకుండా, వాటి వెలికితీత, అన్వేషణ చర్యల కారణంగా నిత్య రావణకాష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

దుఃఖాలు.. సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి..!

Publish Date:Jan 10, 2026

  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.
[

Health

]

సమయానికి తినకపోతే ఈ సమస్య రావడం పక్కా..!

Publish Date:Jan 10, 2026

ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్,  కాల్షియం,  ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం.  ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం.  అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం  కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట.  సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే..  మైగ్రేన్.. ఆహారం సమయానికి తీసుకోకపోతే  అది తలనొప్పి సమస్యగా మారుతుందట.  మరీ ముఖ్యంగా ఈ తలనొప్పి కాస్తా మైగ్రేన్ గా మారే అవకాశం ఉంటుందట. మైగ్రేన్ చాలా తీవ్రమైన తలనొప్పికి కారణం అవుతుంది.  ఆహారం సమయానికి తీసుకోకపోతే ఇది వారంలో రెండు నుండి మూడు రోజులు మైగ్రేన్ కారణంగా బాధపడాల్సి ఉంటుందని ఆహార నిపుణులు, వైద్యులు అంటున్నారు. మైగ్రేన్ వల్ల జరిగేది ఇదే.. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల వచ్చే మైగ్రేన్ నొప్పి ఒక రోజు మాత్రమే ఉంటుందట.  కానీ దానివల్ల ఏకాగ్రత లేకపోవడం, దృష్టి లేకపోవడం, అలసట,  బలహీనత  మైగ్రేన్ ప్రభావాన్ని మరింత పెంచుతాయి.  దీని కారణంగా మైగ్రేన్ తరువాత  రెండు మూడు రోజులు ఏ పనిని ఏకాగ్రతగా చేయలేరు.. . సమయానికి తినాలి.. జాగ్రత్తగా, సమయానికి  తినడం వల్ల తలనొప్పి, దాని వల్ల కలిగే  దుష్ప్రభావాలను నివారించవచ్చు. అందుకే ఎన్ని పనులున్నా సమయానికి ఆహారం తినడాన్ని విస్మరించకూడదు. పెద్దవారు ఉదయం ఆఫీసుకు వెళ్ళేముందు,  పనికి వెళ్ళేముందు తినడం తప్పనిసరి.. అలాగే పిల్లలకు కూడా తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళేముందు ఆహారం పెట్టాలి.  ఎక్కువ సేపు టీవి, ఫోన్, కంప్యూటర్ వంటివి చూడటం వల్ల పిల్లలలోనూ, పెద్దలలోనూ తలనొప్పి, మైగ్రేన్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆహారం దగ్గర నిర్లక్ష్యం చేయకూడదు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...