జగన్ పై కాంగ్రెస్ వైఖరిలో మార్పు
posted on Apr 12, 2013 @ 4:30PM
హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేయడంతో, ఇంతవరకు వైయస్సార్ కుటుంబంతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియక తికమడుతూ, జగన్ మోహన్ రెడ్డి పట్ల కొంచెం మెతక వైఖరి అవలంబిస్తున్నకాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. తమ మంత్రులు ఒకరొకరిగా అందరిపై కేసులు నమోదవుతుంటే కక్కలేక మింగలేక సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్.రాజశేఖర్ రెడ్డిని, అతని కుటుంబ సభ్యులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించరాదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతోంది.
ఈ రోజు నెల్లూరులో ఆర్ధికశాఖా మంత్రి ఆనం రామినారాయాణరెడ్డి స్వర్గీయ వైయస్సార్, మరియు ఆయన కుటుంబ సభ్యులపై నిప్పులు చెరగడంతో కాంగ్రెస్ వైఖరిలో మార్పు వచ్చిందని స్పష్టమయింది. ఆనం మీడియాతో మాట్లాడుతూ “ఆనాడు వైయస్.రాజశేఖర్ రెడ్డి పెద్ద దోపిడీకి పూనుకొన్నాడని తెలియక చాలామంది మంత్రులు ఆయనను గుడ్డిగా నమ్మి ఫైళ్ళ మీద సంతకాలు చేసి, ఈ రోజు తాము చేయని తప్పులకి అన్యాయంగా కేసుల్లో ఇరుకొంటునారు. ఆయనను అడ్డం పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకొన్నాడు. అంత డబ్బు అతను ఎక్కడ దాచిపెట్టాడో ప్రజలకి తెలియ జెప్పాలి. అతను ఆ డబ్బు ఎక్కడ దాచి పెట్టాడో తెలియక అతని చెల్లెలు షర్మిలా పాపం ఊరూరు తిరుగుతూ వెతుకుతోంది. మరో వైపు అతని తల్లి విజయమ్మ కొడుకును విడిపించుకోవడానికి డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది. షర్మిల భర్త అనిల్ కుమార్ పేదల గుడిసెలను ను కూడా వదిలిపెట్టకుండా భూకబ్జాలకు పాల్పడ్డాడు. బయ్యారం గనుల తవ్వకాల కోసం ఏకంగా 5 మండలాలను అతను సర్వనాశనం చేసాడు. ప్రజలను అన్ని విధాల దోచుకుతిన్న వైయస్సార్ కుటుంబ సభ్యులను ప్రజలు వెలివేయాలి,” అని నిప్పులు చెరిగారు.