జూన్ 9న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. అమిత్ షా
posted on May 18, 2024 @ 4:29PM
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది. కూటమి 145 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధిస్తుంది. అలాగే 23 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగుర వేస్తుంది. ఈ మేరకు ఆయన శనివారం చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. వచ్చే నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితరిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారంటూ ఆయన పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం విజయం ఖాయమని పరిశీలకుల విశ్లేషణలూ, షెడ్యూల్ విడుదలకు ముందు వెలువడిన దాదాపు డజనుకు పైగా సర్వేలూ ఇదే విషయాన్ని చెప్పినా.. అమిత్ షా ఇప్పుడు స్వయంగా ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతున్నదంటూ చేసిన ప్రకటన ఎక్కడో ఏ మూలో మిణుక్కుమిణుక్కు మంటూ ఉన్న వైసీపీ గెలుపు ఆశలను ఆవిరి చేసేసిందనే చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికలలో అక్రమాలు జరిగాయనీ, ఎన్నికల సంఘం తెలుగుదేశం ఆదేశాల మేరకు పని చేసిందన్న ప్రకటనల ద్వారా పరోక్షంగానైనా వైసీపీ పరాజయాన్ని అంగీకరించేశారు.
ఇప్పుడిక ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో తెలుగుదేశం కూటమి విజయంపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ మిగలలేదని చెప్పవచ్చు. కేంద్రానికి అందునా కేంద్ర హోంమంత్రికి ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రంలో రాజకీయ గాలి ఎటువైపు ఉంది, ఆయా రాష్ట్రాలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా అందుతూ ఉంటుంది. అందుకే అమిత్ షా ప్రకటనతో ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టడం ఖాయమన్న భావన అందరిలోనూ వ్యక్తం అవుతోంది.