అఫ్గాన్ వ్యవహారాలో పాక్ జోక్యం.. ఇరాన్ సీరియస్ వార్నింగ్
posted on Sep 7, 2021 @ 3:23PM
తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్థాన్ లో పరిస్థితి రోజు రోజుకు భయంకరంగా మారుతోంది. ఇంచుమించుగా 20 ఏళ్లుగా ప్రజలకు అండగా ఉన్నామన్న సాకుతో,ఆ దేశం పై ఆధిపత్యం చెలాయించిన అమెరికా, చేతులు కడుక్కుని, చివరి సైనికుని కూడా చంకనెత్తుకుని చెక్కేసింది. ప్రస్తుత పరిణామాలతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. మరో వంక రష్యా, చైనాసహా ప్రపంచ దేశాలు ఆఫ్గాన్ వ్యవహారాలలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. ఈ నేపధ్యంలోతాలిబన్లతో పాక్ చేతులు కలిపింది.
తాలిబన్ల అరాచకాలకు పాక్ ముష్కరుల అకృత్యాలు తోడు కావడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు వీధుల్లోకి వచ్చి,నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే, తాలిబన్లు నిరసన ప్రదర్శనలను ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు, తాలిబన్లు ప్రముఖులు, మహిళలు లక్ష్యంగా గతంలో కంటే ఇప్పడు ఎక్కువగా దాడులకు దిగుతున్నారు. బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతోంది. ఆఫ్గాన్ ప్రజల్లో తమ దేశ వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటుందనే ఆందోళన మొదలయ్యింది. నిరసన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో పాక్ ఐఎస్‌ఐ చీఫ్ తాలిబన్లను కలవడం ఇందుకు మరింత బలాన్ని చేకూర్చింది.
అఫ్గాన్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందనే ఆందోళన అఫ్గాన్ వాసుల్లో ఎక్కువయ్యింది. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న అఫ్గాన్ మహిళలు.. ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసేందుకు అఫ్గాన్ వీధుల్లోకి వస్తున్నారు. నిరసనలో భాగంగా కాబుల్‌లోని పాక్ రాయబార కార్యాలయంతో పాటు అక్కడి అధ్యక్ష భవనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన తాలిబన్లు నిరసన జరుగుతోన్న ప్రాంతంలో గాల్లోకి కాల్పులు జరిపి నిరసన చేస్తోన్న మహిళలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
తాలిబన్‌లు ఆఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెన్ ఇంటెలిజెన్స్(ISI) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ హమీద్ అఫ్గానిస్థాన్‌లో పర్యటించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అక్కడ అఫ్గాన్ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్న తాలిబన్ నాయకుడు ముల్లా అబ్దుల్ బరాదర్‌ను ఐఎస్‌ఐ చీఫ్ కలవడంతో ఆందోళన ఎక్కువైంది. వాటిపై స్పందించిన తాలిబన్‌లు.. బరాదర్‌ను ఐఎస్‌ఐ చీఫ్ కలిసిన మాట వాస్తవమేనన్నారు. అయితే, కేవలం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగానే పాక్ నిఘా విభాగాధిపతి తమ అగ్రనేతతో భేటీ అయినట్లు తాలిబన్ల అధికార ప్రతినిధులు వెల్లడించారు. కానీ, అఫ్గాన్ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం పాకిస్థాన్‌తో పాటు ఏ ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో పాక్ జోక్యం, తాలిబన్ల తీరును నిరసిస్తూ అఫ్గాన్ మహిళలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.