కుప్పంలో అరాచకం.. సాయిరెడ్డికి షాక్.. బండిపై కోడిగుడ్లు.. టాప్ న్యూస్@7PM
posted on Nov 15, 2021 @ 6:34PM
కుప్పం పట్టణంలో యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటూ నిలదీసిన టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీడీపీ శ్రేణులు, నాయకులను వెంటాడి వేటాడి లాఠీఛార్జి చేశారు. లాఠీచార్జ్‌లో టీడీపీ శ్రేణులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాసులును బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించుకుని రహస్య ప్రాంతాలకు తరలించారు.
---
కుప్పం ఎన్నికల్లో అధికారపార్టీ అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అక్రమాలు చూసి అందరూ సిగ్గుపడాలన్నారు. కుప్పంలో పరిస్థితులు, నిన్నటి నుంచి జరిగిన
పరిణామాలపై వీడియోలు ప్రదర్శించారు. బస్సుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైసీపీ మనుషులను టీడీపీ కార్యకర్తలు నిలదీయడం.. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన యువకుల
సంచారాన్ని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించడం.. కుప్పంలో తిరుగుతున్న ఇతర ప్రాంతాల వాహనాల ఫోటోలను కూడా చంద్రబాబు ప్రదర్శించారు.
--------
విశాఖ నగరంలో ఎంపీ విజయసాయిరెడ్డికి జనసేన షాక్ ఇచ్చింది. జీవీఎంసీ 31వ వార్డులో ఉమెన్స్ కాలేజ్ పోలింగ్ కేంద్రం దగ్గర విజయసాయిరెడ్డిని జనసేన శ్రేణులు అడ్డుకున్నారు.
విజయసాయిని ఎలా అనుమతిస్తారంటూ అధికారులను జనసేన నేతలు నిలదీశారు. జనసేన ఆందోళనతో విజయసాయిరెడ్డి అక్కడ నుంచి వెనుదిరిగారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా
మారింది.
------
వైఎస్ వివేకా హత్యకు భూ వివాదానికి సంబంధం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. భూ వివాదం కారణంగా వివేకా హత్యకు గురయ్యారని ప్రజలను తప్పుదోవపట్టించడానికే
దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు అర్థమవుతుందన్నారు. నిజాలు బయట పెట్టేందుకు సీబీఐ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.8 కోట్ల భూవివాదంలో 40
కోట్ల సుపారీ గంగిరెడ్డి ఎలా ఇస్తానన్నారో తెలియాల్సి ఉందన్నారు. దీని వెనక కచ్చితంగా పెద్దల హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు
------
రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రాజధాని అమరావతి కేసుల్లో రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.
రాజధానిపై నిర్ణయం ఒక్కసారే తీసుకుంటారని, మాస్టర్ ప్లాన్ పరిపూర్ణమైన విధి విధానంతో జరిగిందని తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదన శరీరం నుంచి ఆత్మను వేరు
చేయడమేనన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికి రాష్ట్రం అలానే ఉందని, ఇచ్చిన హామీలు నెరవేరబడాలని శ్యామ్ దివాన్ తెలిపారు.
---------
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ వద్ద బండి సంజయ్ కారును నల్గొండ ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఆధ్వర్యంలో
టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ శ్రేణులకు పోటీగా బీజేపీ కార్యకర్తలు నినదించారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ
నినాదాలు చేశారు. ఎమ్మెల్యే భూపాలరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు పార్టీలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది
-------
టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తెలంగాణ భవన్‌లో ఈ నెల 16న మంగళవారం జరుగనుంది. పార్టీ అధినేత, సీఎం చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నదని
పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ, తెలంగాణ రైతులను, ప్రజలను అయోమయానికి
గురి చేస్తున్న తీరుతెన్నుల మీద చర్చించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణను టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం రూపొందించనున్నదని ఆ వర్గాలు తెలిపాయి.
---------
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం తెలంగాణలో సంచలనంగా మారింది. ఆయన టీఆర్ఎస్ లో చేరుతారని, ఎమ్మెల్సీ సీటు ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. వెంకట్రామిరెడ్డి రాజీనామాతో కొంత కాలంగా విపక్షాలు ఆయనపై చేస్తున్న ఆరోపణలు నిజమేనా అన్న చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి వెంకట్రామిరెడ్డి... కేసీఆర్ బినామీ అని కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజా పరిణామాలతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణపైనే జనాల్లో చర్చ సాగుతోంది.
-----
గిరిజనుల సంక్షేమాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత పాలకుల హయాంలో వెనుకబడిన ప్రాంతాలుగా మిగిలిపోయిన వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15వ తేదీని ఇకనుంచి 'జన్‌జాతీయ గౌరవ్ దివస్'గా కేంద్రం నిర్వహిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
--------
అయోధ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలు కాషాయవాదులను తీవ్ర ఆగ్రహానికి గురిచేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నైనిటాల్ లోని సల్మాన్ ఖుర్షీద్ నివాసం వద్ద దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంటికి నిప్పు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సల్మాన్ ఖుర్షీద్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
-----