ఐసిఎంఆర్ కొనుగోళ్లపై ఏమి మాట్లాడతారు కన్నా గారూ...
posted on Apr 20, 2020 @ 9:25PM
* బీ జె పి రాష్ట్ర అధ్యక్షుడికి డెప్యూటీ సి ఎం సూటి ప్రశ్న
* పర్చేజ్ ఆర్డర్ నిబంధనలు ఓ సారి సరిగ్గా చదవాలని కన్నాకు చురకేసిన ఆళ్ళ నాని
రాపిడ్ టెస్ట్ ల కిట్స్ విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని, లక్ష రాపిడ్ టెస్ట్ కిట్స్ ఒకేసారి తెప్పించుకున్న రాష్ట్రం మనదేనని, చంద్రబాబుతో కుమ్మక్కై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కన్నాలక్ష్మీనారాయణ ఆరోపణలు చేయడం దారుణమని ఉపముఖ్యమంత్రి,వైద్య,ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని విమర్శించారు. "కన్నాగారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను.....ప్రధానిగారికి సైతం కరోనా విషయంలో ఏ చర్యలు తీసుకోవాలో నేనే నేర్పుతున్నాను అని చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ...ప్రధాని గురించి అలా మాట్లాడకూడదు...ప్రధాని గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించకూడదని ఏనాడైనా చెప్పే ధైర్యం చేశారా...చంద్రబాబు కోసం బిజేపి గౌరవాన్ని కూడా పణంగా పెట్టారు.730 రూపాయలకు రాపిడ్ టెస్ట్ కిట్స్ కొన్నామని ,అందులో చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కన్నాలక్ష్మీనారాయణ వాటిని నిరూపించగలరా," అని ఆళ్ళ నాని ప్రశ్నించారు.
మేం 730 రూపాయలకు కిట్స్ కు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కేంద్రం తన ఆధ్వర్యంలో నడిచే ఐసిఎంఆర్ సంస్ధ ద్వారా ఐదు లక్షల కిట్స్ కు సంబంధించి 795 రూపాయలకు ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా కూడా తెలుసుకోవాలని సూచించారు. అందులో అవినీతి,అవకతవకలు జరిగాయని మేం మాట్లాడటం లేదు. కేంద్రప్రభుత్వమే 795 రూపాయలకు కిట్స్ కొనే ప్రయత్నం చేస్తుంటే.... చెప్పినదానికంటే కూడా మేం 65 రూపాయల తక్కువకే కిట్స్ కొనుగోలు చేశాం.మీరు మాత్రం మాది అవినీతి అంటారు.మరి కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐసిఎంఆర్ 795 రూపాయలకు కొనే ప్రయత్నాన్ని మీరు ఏమంటారో చెపుతారా అంటూ ఆళ్ళ నాని, కన్నా లక్షీనారాయణ ను నిలదీశారు.
" లక్షకిట్స్ కు సంబంధించి దక్షణకొరియానుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించినమాట వాస్తవం.730 రూపాయలకు ఆర్డర్ ఇచ్చిఉన్నామో ఆ ఆర్డర్ ఇచ్చిన అగ్రిమెంట్ లో మేం క్లియర్ గా ఏం చెప్పామంటే 730 రూపాయలకు ఆర్డర్ ఇచ్చినాసరే ఏ రాష్ర్టానికైనా ఈ ధర కంటే తక్కువధరకు సరఫరా చేస్తే ఆ రేటుకే మాకు ఇవ్వాలనే స్పష్టమైన ఒప్పందాన్ని ఆ సంస్ధతో చేసుకున్నాం. ఏ రాష్ట్రమైనా, ఇలాంటి క్లాజ్ పెట్టిందా," అని ఆళ్ళ నాని , కన్నాలక్ష్మీనారాయణ ను ప్రశ్నించారు. చత్తీస్ ఘడ్ 337 రూపాయలకు కిట్స్ తీసుకుందని చెబుతున్నారో,ఆ ఆర్డర్ తీసుకోకముందే 337 రూపాయలకే కాదు 300 రూపాయలకు ఏ రాష్ట్రానికి ఇచ్చినా కూడా ఆ ధరకే కిట్స్ ఇవ్వాలన్న నిబంధన పర్చేజ్ ఆర్డర్ లో పెట్టామని ప్రజలకు తెలియచేస్తున్నామన్నారు.