అక్షయ తృతీయ ఆన్‌లైన్ సేల్స్!
posted on Apr 20, 2020 @ 9:00PM
అక్షయ తృతీయ నాడు బంగారం ఎలా కొనుగోలు చేయాలని మదనపడుతున్నారా? మీకెలాంటి ఇబ్బంది లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రముఖ జ్యువెల్లర్స్ నిర్వాహకులు ఆన్‌లైన్‌లో బుకింగ్ ప్రారంభించారు. కొనుగోలుదారుల కోసం తమ సేవలను ఏప్రిల్ 21వ తేదీ నుండి ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నట్లు కళ్యాణ్ జ్యువెల్లర్స్ తెలిపింది. 2 గ్రాముల నుండి ఎంతమొత్తమైనా కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.
ప్రముఖ బంగారం విక్రయదారులు తనిష్క్, కళ్యాణ్ జ్యువెల్లర్స్.. అక్షయ తృతీయ సేల్స్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్ ఏప్రిల్ 18వ తేదీ నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు కస్టమర్లకు ఆన్‌లైన్ సేల్స్ అందుబాటులో ఉంచింది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా నచ్చిన నగలను కొనుగోలు చేయవచ్చు. ఇందుకు తనిష్క్ సిబ్బంది వీడియో కాల్, ఆన్ లైన్ చాటింగ్ ద్వారా కస్టమర్లకు డిజైన్లు అందుబాటులో ఉంచుతారు.
ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్నాక బంగారాన్ని ఇంటి వద్దకు డెలివరీ చేస్తారు. అలా కాదంటే కస్టమర్లు దగ్గరలోని తమ దుకాణం వద్ద తాము కొనుగోలు చేసిన వస్తువును పొందవచ్చునని కూడా ఆప్షన్ ఇచ్చింది. తమ వినియోగదారుల్లో చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని, వారి కోసం ఆన్ లైన్ సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
కస్టమర్ బంగారం కొనుగోలు చేసిన తర్వాత గోల్డ్ ఓనర్‌షిప్ సర్టిఫికేట్ పేరుతో కొనుగోలు సర్టిఫికేట్ ఇస్తామని, దానిని కస్టమర్లు కోరుకున్న పద్ధతిలో అక్షయ తృతీయ రోజున వారికి అందిస్తారట. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ధృవీకరణ పత్రంతో తాము కొనుగోలు చేసిన ఆభరణాన్ని పొందవచ్చు.
లాక్ డౌన్ నేపథ్యంలో మొదటిసారి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని, తద్వారా అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయాలనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు.