అన్నిదారులు రేవంత్ వైపే.. బీజేపీకి బిగ్ షాక్..
posted on Jul 13, 2021 @ 3:59PM
ఒక్కడొచ్చాడు.. అనగనగా ఒక్కడున్నాడు.. కేసీఆర్‌కు కరెక్ట్ మొగుడినంటూ ఒక్కడొచ్చాడు.. కేసీఆర్‌కు ధీటుగా నేనున్నానంటూ ఒక్కడున్నాడు.. అందుకే ఇప్పుడు అందరి చూపు రేవంత్ వైపే.. అందుకే ఇప్పుడు అన్నిదారులు గాంధీభవన్ వైపే.. ఆ పార్టీ.. ఈ పార్టీ.. ఈ జిల్లా.. ఆ నాయకుడు.. అనే తేడా లేకుండా అంతా రేవంత్‌రెడ్డి నాయకత్వానికి జీహుజూర్ అంటున్నారు. బాహుబలిలాంటి బలమైన నేత వస్తే ఇట్టానే ఉంటాది.. మహావృక్షాన్ని కూల్చేసే భూకంపం వస్తే అట్టానే ఉంటాది.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రాకతో అలాంటి సంకేతాలే వస్తున్నాయి.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తెలంగాణ నాయకగణమంతా పునరేకమవుతున్నారు.. రేవంత్ వెంట నడిచేందుకు.. ఆయన నాయకత్వంలో పని చేసేందుకు.. కేసీఆర్‌ను బయటకు గుంజేందుకు.. అంతా మేముసైతమంటూ కదలివస్తున్నారు.. పనిలో పనిగా పుచ్చిపోయిన కొమ్మలు కొన్ని రాలిపోతున్నాయి...
టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనేది ఇన్నాళ్లూ వినిపించిన మాట. రేవంత్‌రెడ్డి ఎంట్రీతో ఇప్పుడా ఈక్వేషన్ మారిపోతోంది. బీజేపీ నాయకులే కాంగ్రెస్ వైపు కదలివస్తున్నారు. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ తర్వాత అంతటి స్థాయి నాయకుడు ధర్మపురి అర్వింద్. ఇప్పుడే ఏకంగా ఆ అర్వింద్ సోదరుడే కాంగ్రెస్‌లో చేరుతుండటం ఆసక్తికరం. మాజీ పీసీసీ చీప్ డి.శ్రీనివాస్ తనయుడు సంజయ్.. ప్రస్తుతం తండ్రితో పాటు టీఆర్ఎస్‌లో ఉన్నా.. పార్టీతో విభేదించి సైలెంట్‌గా ఉంటున్నారు. నిజామాబాద్ మాజీ మేయర్ కూడా అయిన సంజయ్.. తన సోదరుడు ఉన్న బీజేపీలో చేరకుండా రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవడం ఆసక్తికర పరిణామం. అంటే, కేసీఆర్‌ను గద్దె దించి.. తెలంగాణలో అధికారంలోకి రాగల సత్తా.. బీజేపీకంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ఉందనేది ధర్మపురి సంజయ్ ఆలోచనలా కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డి నాయకత్వ లక్షణమే ఆయన్ను కాంగ్రెస్ వైపు అడుగులు వేసేలా చేసిందనడంలో సందేహమే అవసరం లేదు.
సంజయ్ అనే కాదు.. పలువురు బీజేపీ బడా నాయకులు సైతం రేవంత్‌రెడ్డి నాయకత్వానికి జై కొడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎర్ర శేఖర్ సైతం పార్టీకి రాజీనామా చేసి.. రేవంత్‌రెడ్డి చెంతకు చేరడం బీజేపీని కలవరపాటుకు గురి చేస్తోంది. మా పార్టీకి ఏమైంది.. ప్రధానిగా మోదీ ఉన్నారు.. బండి సంజయ్ ఉన్నారు.. ఈటల రాజేందర్ కూడా వచ్చారు.. ఇక తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఆల్టర్‌నేట్ తామేనని విర్రవీగుతున్న కమలదళానికి ఇలాంటి వరుస పరిణామాలు ఊహించని షాక్ అనే చెప్పాలి.
ఇలా బీజేపీ నాయకులనే కాదు.. పలువురు ఇతర పార్టీ నేతలు, స్వతంత్రులు సైతం రేవంత్‌రెడ్డి వైపు అడుగులు వేస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న గండ్ర సత్యనారాయణ తాజాగా రేవంత్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి గతంలోనే కాంగ్రెస్‌ను టీఆర్ఎస్‌లో చేరడంతో.. ఆయనకు సమాన స్థాయి ఉన్న గండ్ర సత్యనారాయణ ఇప్పుడు హస్తం గూటికి రావడంతో.. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయినట్టే కనిపిస్తోంది.
రేవంత్‌రెడ్డిని కాదని.. ఒక్క కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడితే.. 24 గంటలు తిరిగేలోగా.. ముగ్గురు బడాబడా నాయకులు రేవంత్‌కు జై కొడుతూ కాంగ్రెస్‌లో చేరడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రేవంత్ ఎఫెక్ట్ టీఆర్ఎస్ అసంతృప్తులతో పాటు.. బీజేపీనీ దెబ్బ తీస్తుండటం ఆసక్తికర పరిణామం. ఇక జిల్లాల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్న పాత టీడీపీ నాయకులంతా ఇప్పుడు రేవంత్‌రెడ్డి వైపే మళ్లుతున్నారు. తమ నేత మళ్లీ వచ్చాడంటూ.. రేవంత్ నాయకత్వానికి తిరుగులేదంటూ.. జై రేవంతన్న నినాదాలతో దుమ్మురేపుతున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నుంచి వెళ్లే నాయకులను మాత్రమే చూశారని.. ఇప్పుడిక కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయని.. ముందుముందు బీజేపీతో పాటు టీఆర్ఎస్ నుంచి భారీ సంఖ్యలో చేరికలు ఉంటాయని అంటున్నారు. జస్ట్.. వెయిట్ అండ్ సీ.. అంటూ సవాల్ విసురుతున్నారు.