బిల్లులు కట్టక ఉద్యోగుల ఫోన్లు కట్! తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంత ఘోరమా?
posted on Jul 13, 2021 @ 3:59PM
తెలంగాణ ధనిక రాష్ట్రం.. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రమే టాప్.. ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు చెప్పేమాట. విపక్షాలన్ని తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని, ఆరేండ్లలోనే నాలుగు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపిస్తుండగా.. సీఎం కేసీఆర్ సహా మంత్రులు మాత్రం కొట్టిపారేస్తున్నారు .అప్పులు తేవడం సర్వ సాధారమంటూ.. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమేనని కవరింగ్ ఇస్తున్నారు. అయితే తెలంగాణ ఎంత సంపన్న రాష్ట్రమే, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి తాజాగా జరిగిన ఘటన చూస్తే అర్ధమవుతోంది. కొన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం ఫోన్ సౌకర్యం కల్పించింది. మొబైల్ సంస్థల నుంచి గ్రూప్ ప్యాకేజీ తీసుకుంది. అయితే ఆ బిల్లులు చెల్లించకపోవడంతో ఉద్యోగుల ఫోన్లు కట్ అయ్యాయి. సోమవారం నుంచి చాలా శాఖలకు సంబంధించిన ఉద్యోగుల మొబైల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ కట్ అయ్యాయని తెలుస్తోంది.
ప్రభుత్వం ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో నెట్ వర్క్ సంస్థ ఉద్యోగుల అవుట్ గోయింగ్ సౌకర్యం నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇది ఒక్కటి చాలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఉద్యోగుల ఫోన్ల బిల్లులు చెల్లించలేని దుస్థితిలో ఆర్థిక పరిస్థితి ఉండటం ఆందోళన కల్గిస్తోంది. ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదనే చర్చ జరుగుతోంది. ఎప్పుడు ఠంచన్ గా ఒకటవ తేదీనే వేతనాలు తీసుకునే ఉద్యోగులు.. ఇప్పుడు ఏ తేదీన వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. రాజధాని హైదరాబాద్ వరకు ఒకటి లేదా రెండో తేదీన వేతనాలు అందిస్తూ జిల్లాలకు మాత్రం లేట్ గా ఇస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో జిల్లాకు ఒక్క రోజున వేతనాలు వస్తున్నాయని అంటున్నారు. ఇక శాఖల వారీగానూ ఒక్కొక్కరికి ఒక రోజున వేతనాలు జమ చేస్తున్నారట. కొన్ని శాఖల ఉద్యోగులకు 10వ తేదీ వరకు వేతనాలు జమ కాలేదట. పెన్షనర్ల పరిస్థితి ఇంతే. కార్పొరేషన్ ఉద్యోగులకైతే రెండో వారంలో వస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు చూడలేదంటున్నారు ఉద్యోగులు.
ఇక పీఆర్సీ, డీఏ గురించి చెప్పుకుంటే మరీ దారుణం అంటున్నారు తెలంగాణ ఉద్యోగులు. పీఆర్సీ ప్రకటనను మూడేండ్లు సాగదీసింది తెలంగాణ సర్కార్. వాయిదాల పేరుతో కమిటి కాలాయాపన చేయగా.. నివేదిక సర్కార్ కు చేరాక కరోనా సాకుతో కాలం వెల్లదీసింది. మూడేండ్లు సాగదీసిన ప్రభుత్వం.. ఎట్టకేలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముందు పీఆర్సీకి ఆమోదం తెలిపింది. మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పీఆర్సీ ప్రకటన చేశారు కేసీఆర్. ఏప్రిల్ నుంచి 30 శాతం ఫిట్ మెంట్ తో కొత్త వేతనాలు ఇస్తామన్నారు. కాని రెండు నెలలైనా పెరిగిన వేతనాలు అందుకోలేదు ఉద్యోగులు.ఏప్రిల్ రెండో వారంలో కరోనా సోకడంతో క్వారంటైన్ కు వెళ్లారు కేసీఆర్. దీంతో ఏప్రిల్ లో సాధ్యం కాలేదు. మే నెల వేతనంతో వస్తుందని భావించినా.. కరోనా ఆర్థిక కష్టాలంటూ మళ్లీ పెండింగులో పెట్టింది ఫైనాన్స్ డిపార్ట్ మెంట్. తెలంగాణ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగులో ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న సీఎం కేసీఆర్.. ఉద్యోగుల వేతనాలు కూడా ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నారన్నది విపక్షాల, ఉద్యోగ సంఘాల మాట. దీనికి మాత్రం అధికార పార్టీ నేతలు, పాలకుల నుంచి సమాధానం లేదు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ మరీ ఘోరం. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలంటే జగన్ రెడ్డి సర్కార్ అప్పు తేవాల్సిందే. అప్పు దొరికితేనే ఉద్యోగులకు వేతనాలు.. లేదంటే అంతే. తొలి వారంలో వేతనాలు అందితే అదే అదృష్టం అన్నట్లుగా ఏపీ ఉద్యోగుల పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర పరిమితికి మించి అప్పులు తేవడంతో... ఇకపై ఏపీకి రుణం దొరికే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఏపీ సర్కార్ 17 వేల కోట్లు రూపాయలను అదనంగా రుణం తీసుకుందని కాగ్ స్పష్టం చేసింది. ఈ వార్తలతో వచ్చె నెల తమకు వేతనాలు వస్తాయా రావా అన్న ఆందోళనలో ఏపీ ఉద్యోగులు ఉన్నారు. ఏపీలో ఉద్యోగులకు ఏకంగా ఏడు డీఏలు పెండింగులో ఉన్నాయంటున్నారు. డీఏలు తర్వాత ముందు మాకు వేతనాలు వస్తే చాలన్నట్లుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితిలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పులు తేవాల్సి రావడం చాలా ప్రమాదకరమంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ముందు ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందనే అభిప్రాయం ఎకనమిస్టుల నుంచి వస్తోంది. ప్రభుత్వాలు ఇప్పటికేనా ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని, లేదంటే రాష్ట్రల భవిష్యత్ ఆగమ్య గోచరంగా తయారయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.