తీన్మార్ మల్లన్నకు బిగ్ రిలీఫ్.. కేసులు, పోలీసులపై హైకోర్టు సీరియస్..
posted on Oct 4, 2021 @ 12:19PM
తీన్మార్ మల్లన్నపై కేసుల మీద కేసులు పెట్టి జైల్లో తోసింది కేసీఆర్ సర్కారు. ఒకటి రెండూ కాదు.. మల్లన్నపై ఏకంగా 35 కేసులు పెట్టారు పోలీసులు. మరీ విచిత్రం ఏంటంటే.. ఒకే కారణంతో అనేక కేసులు పెట్టి కక్ష్య సాధిస్తున్నారు. మల్లన్నకు బెయిల్ రాకుండా చేసి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ జైల్లోనే మూసేయాలనేది పాలకుల స్కెచ్. మల్లన్నను బయటకు రాకుండా చేసి.. క్యూ న్యూస్ గొంతు నులిపేయాలనేది ప్రభుత్వం పన్నిన కుట్ర. కానీ, గట్టి పిండం మల్లన్న.. సర్కారు కబంధ హస్తాల నుంచి బయటపడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీలో చేరుతానంటూ లేఖ రాసి.. పొలిటికల్‌గా బలం పెంచుకుంటున్నారు. ఇక, తనపై నమోదైన కేసులపై న్యాయపరంగానూ గట్టిగా ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే లాయర్‌ను మార్చేశారు. కొత్త న్యాయవాది దిలీప్ సుంకర్ సాయంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ వేసి బిగ్ రిలీఫ్ పొందారు. ఇంతకీ హైకోర్టు ఏమందంటే...
తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్న సతీమణి మాతమ్మ వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారించింది. మల్లన్నపై ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంచలన ఆదేశాలు వెలువరించింది.
తెలంగాణలో మల్లన్నను అరెస్ట్ చేయాలన్నా.. మరో కేసు నమోదు చేయాలన్నా.. డీజీపీ అనుమతి తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. డీజీపీ పర్యవేక్షణలోనే విచారణ జరగాలని తేల్చి చెప్పింది. కేసు నమోదు చేసిన తరువాత.. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చాకే విచారణ చేయాలని తెలిపింది.
మల్లన్నపై ఉన్న 35 కేసులపై న్యాయవాది దిలీప్ సుంకర వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్‌పై మంగళవారం మరోసారి హైకోర్టులో మల్లన్న తరుపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.