నగల దుకాణంలో నేవీ అధికారి చోరీ.. సీసీ కెమెరాలో బుక్..
posted on Jun 28, 2021 @ 2:55PM
అతను ఉన్నత విద్యావంతుడు.. నేవీలో ఉద్యోగి.. విశాఖపట్నంలో సెయిలర్‌గా పని చేస్తున్నాడు. ప్రేమించి వివాహం చేసుకున్న భార్యతో సంతోషమైన జీవితం గడుపుతున్నాడు. కానీ దారి తప్పాడు. విద్యా వంతుడు దొంగగా మారాడు.. నగల దుకాణంలో చోరీ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. పోలీసులకు పట్టుబడి జైలులో ఊచలు నెక్కిస్తున్నారు ఆ దోంగ నేవీ అధికారి. విశాఖలో వెలుగుచూసిన ఈ ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. దొంగతనంలో అతనికి భార్య కూడా సహకరించడం మరో ట్విస్ట్.
హరియాణాలోని మహేంద్ర గగడ్‌కు చెందిన రాజేష్ విశాఖ కేంద్రంగా నడిచే ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌లో సెయిలర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీహరిపురంలో తన భార్యతో ఉంటున్నారు. అయితే
ఆన్‌లైన్ ట్రేడింగ్‌పై మోజు పెంచుకున్నాడు రాజేష్. భారీ ఎత్తున డబ్బులు ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ట్రేడింగులో రాజేష్ చాలా నష్టపోయాడు. భారీగా అప్పులపాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతోన్న సమయంలో రాజేష్‌కు దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు భార్య సహకారం కూడా అందింది. అందుకోసం నగరంలో పలుచోట్ల బైక్‌పై తిరిగారు. తరచూ తాము వెళ్లే గోపాలపట్నం రైల్వే స్టేషన్ రోడ్డులో శ్రీ జ్యుయలరీ దుకాణంపై వారి కన్నుపడింది.
కర్ఫ్యూ కారణంగా రాత్రిపూట జనసంచారం తక్కువగా ఉండడంతో.. తాము దొంగతనం చేయడానికి ఆ షాపునే ఎంచుకున్నారు. పక్కాగా ప్రణాళిక వేసి అమలు చేశారు. తమ ప్లాన్ లో భాగంగా రాజేష్ తన భార్యతో.. బైక్‌పై గోపాలపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. అనంతరం రాత్రి ఒంటిగంటల సమయంలో తన వెంట తెచ్చుకున్న రాడ్‌తో షట్టర్ తాళాలను పగలగొట్టి. లోపల ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దోచుకున్నాడు. తర్వాత అక్కడనుంచి భార్యభర్తలిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.
చోరి చేసిన తర్వాత తమ సొంతూరు హరియాణాకు వెళ్దామని ఇద్దరూ ప్లాన్ వేసుకున్నారు. అనుకున్నట్లే ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకొన్నారు. అయితే తప్పు చేసిన వారు ఎప్పటికైనా చిక్కుతారు అన్నట్లు ఈ జంట కూడా పోలీసులకు దొరికిపోయింది. నగల దుకాణం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. ప్రత్యేక బృందంగా ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి విచారించారు. దీంతో సదరు జంట మొత్తం విషయాన్ని బయటపెట్టేసింది.