రాందేవ్ బాబాపై కేంద్రం సీరియస్..
posted on May 23, 2021 @ 7:44PM
అల్లోపతి వైద్యంపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోంది. రాందేవ్ బాబా క్షమాపణకు ఆలిండియా వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్య జటిలమయ్యే పరిస్థితులు ఉండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. యోగా గురువు రాందేవ్ బాబాకు ఘాటు లేఖ రాశారు. అల్లోపతి వైద్య విధానంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే బాగుంటుందని రాందేవ్ బాబాకు ఆయన సూచించారు. రాందేవ్ బాబా వ్యాఖ్యలు కరోనా వారియర్స్ మనోభావాలతో పాటు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని హర్షవర్ధన్.. తన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
కొవిడ్‌కు వ్యతిరేకంగా వైద్యులు అహోరాత్రాలు శ్రమించి పనిచేస్తున్నారని, వారికి మద్దతునిస్తూ ఆరోగ్య కార్యకర్తలు కూడా సేవలు చేస్తున్నారని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కోవిడ్ కల్లోలంలో అల్లోపతి వైద్యులు అనేక లక్షల మంది ప్రాణాలను కాపాడారని, వారి వైద్య విధానంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని కేంద్రమంత్రి ఆక్షేపించారు. కోవిడ్‌ను సామూహికంగా మాత్రమే ఎదుర్కోగలమని హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్ రోగులకు సేవలు చేస్తూ వైద్యులతో పాటు ఇతర సిబ్బంది కూడా తమ ప్రాణాలను కోల్పోయారని, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందన్న విషయాన్ని కేంద్రమంత్రి తన లేఖలో గుర్తు చేశారు. ఇంతటి సేవ చేస్తున్న అల్లోపతి వైద్య విధానాన్ని తూలనాడుతూ రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం భావ్యం కావని హర్షవర్ధన్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలో రికవరి రేటు 88 శాతంగా ఉందని, మరణాల రేటు 1.13 శాతంగా ఉందని, ఇదంతా అల్లోపతి వైద్య విధానంతోనే సాధ్యమని కేంద్ర మంత్రి అన్నారు. ఏ వ్యాఖ్యలనైనా చేసేటప్పుడు కాల, మాన, పరిస్థితులను బేరీజు వేసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఇంతటి క్లిష్ట సమయంలో అల్లోపతి వైద్య విధానాన్ని తూలనాడుతూ మాట్లాడటం వల్ల తత్సంబంధిత వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, అలా మాట్లాడటం ఏమాత్రం సముచితంగా లేదని కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలియా, ఇబోలా, టీబీ లాంటి మహమ్మారి రోగాలకు అల్లోపతి వారే టీకాలను కనిపెట్టారన్న విషయాన్ని మరిచిపోరాదని, తాజాగా వచ్చిన మహమ్మారి కరోనాకు సంబంధించిన టీకా కూడా అల్లోపతి వైద్య విధానం నుంచే వచ్చిందని హర్షవర్ధన్ తన లేఖలో రాందేవ్ బాబాకు గుర్తు చేశారు.