జగన్ నివాసాన్ని ముట్టడించిన ఎబివిపి కార్యకర్తలు
posted on Feb 13, 2024 @ 4:08PM
రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలి అనే నినాదంతో వారు 'ఛలో తాడేపల్లి' పేరిట ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని వారు మండిపడ్డారు. సీఎం నివాసం ముట్టడి సందర్భంగా విద్యార్థి నేతలు ఒక్కసారిగా దూసుకువచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడ్నించి మంగళగిరి పీఎస్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పలువురు విద్యార్థి నేతలు పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. దొరికిన వాళ్లను ఓ వాహనంలోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ముట్టడిలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థి నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థి నేతలకు గాయాలైనట్టు సమాచారం.ఉపాధ్యాయుల పోస్టుల గురించి మాట్లాడని సీఎం ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డీఎస్సీ విద్యార్థులు మండిపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో వందల మంది డీఎస్సీ అభ్యర్థులు ఈరోజు రోడ్డెక్కారు. 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించడానికి వచ్చారా లేకపోతే ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి వచ్చారా అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుని 23వేల పోస్టులతో మెగా డీఎస్సీని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు ఈ ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లలో డీఎస్సీ విడుదల చేయకపోవటం సిగ్గుచేటు, ఆవిరైపోతున్న ఉపాధ్యాయ నిరుద్యోగ ఆశలు, సున్నాలలో నోటిఫికేషన్ వద్దు మెగా డీఎస్సీ ముద్దు అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో రెండుసార్లు నోటిఫికేషన్ ఇస్తే జగన్ ఒక్కసారి కూడా విడుదల చేయకపోవటం సిగ్గు చేటు అని విద్యార్థులు ఎద్దేవా చేశారు.
"నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులకు పాల్పడుతుంది. తక్షణమే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకపోతే నిరుద్యోగుల సత్తా ఎమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం" అని విద్యార్థులు హెచ్చరించారు.
గత నాలుగు సంవత్సరాలుగా మెగా, జంబో, మినీ డీఎస్సీ అంటూన్నారు కాని ఇప్పటివరకూ ఒక్క పోస్టు కూడా విడుదల చేయకుండా జాప్యం చేశారని విద్యార్థులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వారం రోజులు లోపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకపోతే పక్క రాష్ట్రంలో కేసీఆర్కు పట్టిన పరిస్థితే జగన్కు పడుతుందని ఉద్యోగులు హెచ్చరించారు. ఏపీని నిరుద్యోగి రాష్ట్రంగా మారుస్తామన్న మీ హామీ ఏమైందని, నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మెగా డీఎస్సీ ప్రకటించకుంటే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం: నిరుద్యోగులు
వైసీపీ ప్రభుత్వం వారం రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని విద్యార్థులు రోడ్డుపై బైటాయింపు ఆందోళన చేశారు.వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో జగన్మోహనరెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు. వీరిని అరెిస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీ అభ్యర్థుల నిరసన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ మద్దతు తెలిపారు. విద్యార్ధులు చదువుకోవడం వలన నిరుద్యోగ శాతం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి అనడం దారుణం విద్యార్థులు మండిపడ్డారు.