ముష్టియా.. కళ్లు చెదిరే సంపాదన..!
posted on Feb 13, 2024 @ 4:22PM
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం పోకిరి. కలెక్షన్ వసూళ్లలో ఈ చిత్రం పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఆ చిత్రంలో సాఫ్టేవేర్ ఇంజినీర్ పాత్రలో బ్రహ్మనందం, ముష్టివాడు పాత్రలో ఆలీ మధ్య సంభాషణ... మాఫియాలాగా ముష్టియా.. అంటూ బ్రహ్మనందానికి ఆలీ చెప్పే సమాధానం.. ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. అయితే ఆ ముష్టియానే ఆసరాగా చేసుకొని.. ఓ ఫ్యామిలీ ఫ్యామిలీ.. కోట్లాది రూపాయిలు గడించింది. ఈ ముష్టి ఎత్తుకోవడం ద్వారా ఆ ఫ్యామిలీ రెండతస్తుల భవనం, 20 వేల రూపాయిలు ఖరీదు చేసే అధునిక సెల్ ఫోన్‌తోపాటు వ్యవసాయ భూమి, బైక్‌తోపాటు ఇండ్ల స్థలం.. అలాగే జస్ట్ ఆరు వారాల్లోనే 2.5 లక్షల రూపాయిల ఆ ప్యామిలీ సంపాదన చూసి పోలీసులే నోరు వెళ్లబెట్టేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన మద్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
ఫిబ్రవరి 9వ తేదీన ఇండోర్ నగరంలో ముష్టి ఎత్తుకోంటున్న తల్లి ఇందిరా బాయితోపాటు 7 ఏళ్ల వయస్సు ఉన్న ఆమె కుమార్తెను పోలీసులు అదుపులోకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో ఇందిరాబాయ్ వద్ద నుంచి 19,600 రూపాయిలు, అలాగే 7 ఏళ్ల వయస్సు ఉన్న ఆమె కుమార్తె నుంచి 6 వందల రూపాయిలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. ఆమె నుంచి వచ్చిన సమాధానం విని పోలీసులే నిర్ఘాంత పోయారు. ఆమె స్వయంగా తన ఆస్తుల వివరాలు పోలీసులకు వివరించడంతో.. వారంతా కంగుతినడమే కాకుండా.. దొంగతనం చేయడం కంటే ముష్టి ఎత్తుకోవడమే ఉత్తమైన మార్గమేనంటూ ఆమె ఖాకీలకు హితబోధ చేయడం కోసమెరుపు. అయితే తమ వద్ద ఉన్న ఖరీదైన సెల్ ఫోన్ తాను వాడతానని... బైక్ మాత్రం తన భర్త వాడతాడని..ఇక పొలం అయితే పక్క రాష్ట్రం రాజస్థాన్‌లోని కోట సమీపంలో ఉందంటూ ఆమె సెలవివ్వడం గమనార్హం.
ఇందిరాబాయ్‌కు మరో నలుగురు చిన్నారులు ఉన్నారు. వారి వయస్సు10, 8, 3, 2 ఏళ్లు. వారిని యాచక వృత్తిలోకి దింపి.. ఇండోర్ నగరంలోని ప్రధాన కూడళ్లలో వారితో ముష్టి ఎత్తిస్తోంది. నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలు.. ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ మందిర్‌కు వెళ్లే మార్గం, లవ్ కుష్ స్క్వేర్ వద్ద వారిని ఉంచి.. వారి చేత ముష్టె త్తించుకోవడం.. దాంతో వారి రాబడి బాగా పెరిగిందని.. దీంతో ఆస్తుల బాగా కూడబెట్టారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మరోవైపు... ఇందిరా బాయ్‌తోపాటు ఆమె కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆ సమీపంలోనే ఉన్న ఆమె భర్తతోపాటు మరో ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి పరారైయ్యారు.
ముష్టివారికి పునరావాసం కల్పించేందుకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి ఓ ఎన్జీవో పని చేస్తోంది. అందులోభాగంగా ఇండోర్‌లోని 38 ముఖ్య కూడళ్ల వద్ద ఉన్న 7 వేల మంది యాచకులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారిలో సగానికి సగమంది చిన్నారులే ఉన్నారని.. అయితే వారి ఏడాది సంపాదన మాత్రం 20 కోట్ల రూపాయిలుగా ఉందని ఎన్జీవో సంస్థ నిర్వాహకులు వెల్లడిస్తుండడం గమనార్హం.