ఢిల్లీకి హడావుడిగా వెళుతున్న కేసీఆర్.. రేవంత్ రెడ్డే టార్గెట్టా?
posted on Sep 23, 2021 @ 4:12PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... బీజేపీకి దగ్గరవుతున్నారా? రేవంత్ రెడ్డి స్పీడ్ తో గులాబీ బాస్ హడలిపోతున్నారా? బీజేపీ, టీఆర్ఎస్ కలిసి రేవంత్ ను దెబ్బ కొట్టే ప్లాన్ చేస్తున్నాయా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రెండు వారాల్లోనే కేసీఆర్ హడావుడిగా రెండో సారి ఢిల్లీ వెళుతుండటం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. కేసీఆర్ ప్రగతి భవన్ లేదా ఫాంహౌజ్ తప్ప బయటికి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకా ఆయన జిల్లాలు పర్యటించింది చాలా తక్కువ. పార్టీ నేతల చావులు, వర్ధంతి లాంటి కార్యక్రమాలకు తప్ప.. ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఆయన ఎక్కువగా తిరగలేదు. ఇటీవలే కొన్ని జిల్లాలు పర్యటించారు కేసీఆర్. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే తిరిగారని విపక్షాలు ఆరోపించాయి.
ఫాంహౌజ్ ముఖ్యమంత్రి అని విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ .. సెప్టెంబర్ లోనే రెండోసారి ఢిల్లీకి వెళుతుండటం రాజకీయ వర్గాల్లోనూ ఆశ్చర్యంగా మారింది. అది కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో హడావుడిగా వెళుతుండటం మరింత ఆసక్తి రేపుతోంది. సెప్టెంబర్ 24నే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి హాజరైన తర్వాత బీఏసీ భేటీలో సమావేశాల ఎంజెడాను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రి పయనం కానున్నారు. ఈ నెల 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశం కానున్నారు. 26వ తేదీన విజ్జానభవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో సీఎం సమావేశమై చర్చిస్తారు. 26న సాయంత్రం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారని సీఎంవో ప్రకటన విడుదల చేసింది.
ముఖ్యమంత్రి ఏ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ అయినా వారం రోజుల ముందే ఖరారవుతుంది. కాని ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ను కొన్ని గంటల ముందే విడుదల చేశారు. దీంతో ఈ పర్యటన ముందస్తుగా నిర్ణయించింది కాదని.. అప్పటికప్పుడే ఖరారు చేశారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. ఈ నెలలోనే ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్. తొమ్మిది రోజుల పాటు ఆయన పర్యటన హస్తినలో కొనసాగింది. సెప్టెంబర్ 1న ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 2న ఢిల్లీలోని వసంత్ విహార్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. తర్వాత ప్రధాని, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 9న తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏకబిగిన తొమ్మిదిరోజుల పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మకాం వేయడం ఇదే ప్రథమం. దీంతో కేసీఆర్ 9 రోజుల ఢిల్లీ పర్యటనరాజకీయ వర్గాల్లో చర్చలను, సందేహాలకు తావిచ్చింది.
మంత్రులను కలుసుకున్న తరువాత వచ్చిన ప్రకటనల కన్నా కేసీఆర్ ఏకాంతంగా ప్రధాని మోదీతో, ఇతరులతో భేటీ అవడమే అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. ఢిల్లీతో సత్సంబంధాలను కేసీఆర్ కలిగి ఉన్నట్లు కనిపించింది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఏమి జరిగింది? ఇది ప్రభుత్వపరమైన కలయికేనా? వీటికి రాజకీయాలతో సంబంధం ఉందా? అన్న అంశాలపై ఎవరికి వారు తమదైన శైలిలో ఊహగానాలు చేశారు. ఎన్నికల రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలు ఒక పట్టాన అంతుచిక్కవని, ఏ అడుగువేసినా దాని వెనుక అర్థం పరమార్థం ఉంటాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఎన్నికను వాయిదా వేయడంతో కేసీఆర్ వల్లే షెడ్యూల్ రాలేదని ప్రచారం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆరోపణలు చేశారు. బీజేపీ పెద్దలతో కేసీఆర్ రాజీ పడ్డారని మండిపడ్డారు.
తాజాగా కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వెళుతుండటంతో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజమేననే చర్చ సాగుతోంది. బీజేపీ పెద్దలతో గత సమావేశాల్లో జరిగిన చర్చలకు కొనసాగింపుగా మరోసారి చర్చలు జరిపేందుకే కేసీఆర్ హస్తిన వెళుతున్నారని అంటున్నారు. దేశంలో ప్రస్తుతం బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది. ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి భారీగా సీట్లు తగ్గవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభలో తమకు టీఆర్ఎస్ సహకారం అవసరం ఉంటుందనే యోచనలో కమలనాధులు ఉన్నారని అంటున్నారు. అందుకే కేసీఆర్ కు స్నేహహస్తం ఇచ్చారని ఢిల్లీ వర్గాల టాక్. అదే సమయంలో కేసీఆర్ కు బీజేపీ అవరసం ఉందని చెబుతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ వేగంగా బలపడుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకా హస్తం కేడర్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సభలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. జనాల్లోనూ ఆయన క్రేజీ విపరీతంగా పెరిగిపోతంది. దీంతో రేవంత్ రెడ్డికి బ్రేకులు వేయకపోతే కష్టమనే భావనకు కేసీఆర్ వచ్చారని అంటున్నారు. రేవంత్ రెడ్డి దూకుడుతో బీజేపీకి కూడా గండి పడుతోంది. గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఒక్కొక్కరిగా సొంత గూటికి వెళుతున్నారు. దీంతో తమకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేంద్ర పెద్దలు, గులాబీ బాస్ చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసుపైనా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ రెండు వారాల్లోనే మరోసారి ఢిల్లీకి వెళుతున్నారని చెబుతున్నారు.