10 లక్షలిస్తే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై! బేరం కుదుర్చుకున్న గుజరాత్ ముఠా
posted on May 11, 2024 @ 4:55PM
దేశంలోని వివిధ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్ష నిర్వహించారు. అయితే నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు హల్‌చల్ చేశాయి. మరో వైపు 10 లక్షల రూపాయలు ఇస్తే.. నీట్ పరీక్షలో క్వాలిఫై అయ్యేలా చూస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నీట్ పరీక్షలో అక్రమాలకు గుజరాత్ కేంద్రంగా మారింది. గుజరాత్ లోని ఓ నీట్ యూజీ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాకెట్ గుట్టు రట్టయింది. 10 లక్షల రూపాయలిస్తే నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యేలా చూస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ స్కూల్ టీచర్ తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గోద్రాలోని ఒక పాఠశాలలో గత ఆదివారం జాతీయస్థాయి వైద్య విద్య అర్హత పరీక్ష అయిన నీట్-యూజీ ఎగ్జామ్ జరిగింది. ఈ పరీక్షకు ఎగ్జామినర్‌గా వ్యవహరించిన తుషార్ భట్ అనే ఫిజిక్స్ టీచర్ పరీక్ష పాస్ చేయిస్తానని ఆరుగురు విద్యార్థులతో బేరం కుదుర్చుకున్నాడు.
ఈ ఎగ్జామ్ లో జవాబులు తెలియని ప్రశ్నలను మార్కింగ్ చేయకుండా ఖాళీగా వదిలేసి ఆన్సర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు ఇచ్చేస్తే తాను ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సరైన జవాబులు రాస్తానని ఆ ఆరుగురు విద్యార్థులకు చెప్పాడు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఓ విద్యార్థి నుంచి రూ. 7 లక్షలను అడ్వాన్స్ గా తీసుకున్నాడు. అయితే ఈ విషయం కాస్తా బయటకు పొక్కి జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఎగ్జామ్ సెంటర్ పై దాడి చేసిన పోలీసులు తుషార్ భట్ తోపాటు పరశురాం రాయ్, ఆరిఫ్ వోరా అనే ఇద్దరు బ్రోకర్లను కూడా అరెస్టు చేశారు. భట్ కారులోంచి రూ. 7 లక్షల అడ్వాన్స్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ తుషార్‌ను విచారణ చేసి అతడి ఫోన్లో నీట్ పరీక్ష రాసిన 16 మంది విద్యార్థుల ఫోన్ నెంబర్లు, వాళ్ల హాల్ టికెట్ల నెంబర్లను గుర్తించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు రికార్డు స్థాయిలో విద్యార్థులు హాజరైయ్యారు. మొత్తం 23.30 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. నీట్ పరీక్ష కోసం మొత్తం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10 లక్షల బాలురు, 13 లక్షల బాలికలు ఉన్నారు. రీజియన్లవారీగా చూస్తే మొత్తం దరఖాస్తుల్లో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్- 3,39,125 దరఖాస్తులు, ఆ తర్వాత మహారాష్ట్ర 2,79,904 దరఖాస్తులు, రాజస్థాన్ 1,96,139 దరఖాస్తులు అందాయి. ఇక దక్షిణాన తమిళనాడు నుంచి 1,55,216 దరఖాస్తులు, కర్నాటక 1,54,210 దరఖాస్తులు అందాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1.5 లక్షల మంది (ఏపీ 70 వేలు, తెలంగాణ 80 వేలు) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
- ఎం.కె. ఫజల్