విజయమ్మ మద్దతు షర్మిలకే... జగన్ ను నమ్మొద్దని చెప్పేసినట్లేగా?
posted on May 11, 2024 @ 4:30PM
దివంగత వైఎస్ సతీమణి, ఏపీ సీఎం జగన్ కన్న తల్లి, ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ తాను ఎవరివైపో స్పష్టంగా చెప్పేశారు. తన కుమార్తె షర్మిలకే తన మద్దతు అని విస్పష్టంగా ప్రకటించేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఆమె రాజీనామా చేసినప్పుడే ఆమెను తాడేపల్లి ప్యాలెస్ నుంచి పొగపెట్టి గెంటేశారన్న వార్తలు వినిపించాయి. అయితే ఆమె మాత్రం పార్టీ ప్లీనరీ వేదికగా హుందాగా రాజీనామా చేసి, కుమారుడు జగన్ కు ముద్దు పెట్టి మరీ తెలంగాణలో రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు సొంతంగా పార్టీ పెట్టుకున్న కుమార్తె షర్మిలకు తోడుగా ఉండేందుకు వెడుతున్నాననీ చెప్పారు. తన బిడ్డలిద్దరూ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాననీ, ఇద్దరినీ ఆశీర్వదిస్తున్నాననీ చెప్పారు.
సరే ఒక సారి ఆమె తాడేపల్లి ప్యాలెస్ విడిచి వెళ్లిన తరువాత ఆమె మళ్లీ ఆ ప్యాలెస్ లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అడపాదడపా ఇడుపులపాయలో వైఎస్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలలో కుమారుడితో ముచ్చటించడం వినా వారి మధ్య పెద్దగా సఖ్యత కనిపించలేదు. మధ్యలో ఒక సారి ఆమె అమరావతి వచ్చినప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రం వెళ్లలేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు తప్ప పక్కనే ఉన్ కుమారుడి నివాసం వైపు చూడనైనా చూడలేదు.
ఆ తరువాత షర్మిల కుమారుడి వివాహానికి జగన్ ను ఆహ్వానించడానికి షర్మిలతో కలిసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు, మళ్లీ ఆమెతో పాటే బయటకు వచ్చేశారు. దీనిని బట్టి షర్మిల విషయంలో జగన్ తీరును విజయమ్మ వ్యతిరేకించారని స్పష్టంగా అర్ధమౌతుంది. ఇక షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ నుంచి ఆమెపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు వైసీపీ వర్గాలే అప్పట్లో చర్చించుకున్నారు. ఇక ఎన్నికల బరిలోకి షర్మిల దిగిన సమయంలో అయితే జగన్ విజయమ్మపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారనీ, తనకు మద్దతుగా ప్రచారం చేయాల్సిందేనని పట్టుపట్టారనీ వార్తలు వచ్చాయి. చివరికి తన కోసం ప్రచారం చేయకున్నా ఫరవాలేదు కానీ షర్మిల తరఫున మాత్రం ప్రచారం చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పడంతో ఆమె మనవడి వద్దకు అమెరికా వెళ్లిపోయారని కూడా అప్పట్లో రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపించింది. ఎన్నికల వేళ ఆమె తన బిడ్డలలో ఎవరి తరఫునా నిలబడకుండా తటస్థంగా ఉండేందుకే అమెరికా పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషించారు.
గత ఎన్నికలలో జగన్ విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన విజయమ్మ ఇప్పుడు ఆయన చావో రేవో పరిస్థితుల్లో ఉన్న సమయంలో అండగా ఉండకుండా అమెరికా వెళ్లినప్పుడే జగన్ తరఫున ప్రచారం చేయడం ఇష్టం లేకనే ఆమె దూరం జరిగారని వైసీపీ వర్గాలే చర్చించుకున్నాయి. గత ఎన్నికలలో జగన్ విజయంలో కీలకంగా వ్యవహరించిన సొంత చెల్లెలు షర్మిల ఇప్పుడు జగన్ నే ఢీ కొంటుంటే, కన్న తల్లి కుమారుడికి అండగా నిలవడం ఇష్టం లేక దూరం జరిగారు.
2019 ఎన్నికల్లో ఐక్యంగా ఉన్న వైఎస్ కుటుంబం తర్వాత పరిణామాలతో నిట్టనిలువుగా చీలిపోయిది. అన్న జగన్‌తో విభేదించిన షర్మిల ముందు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న షర్మిలకే వైఎస్ ఫ్యామిలీ మద్దతుగా నిలిచింది. ఒకవైపు కుమారుడు, మరోవైపు కుమార్తె ఇద్దరూ చెరో దారిలో వెళ్తుంటే తల్లి విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది. తెలంగాణ రాజకీయాల్లో ఉన్నప్పుడు షర్మిలకు తల్లిగా విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అయితే షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి జగన్ కు వ్యతిరేకంగా రాజకీయ సమరం ప్రారంభించినప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆయితే షర్మిల ఆంధ్రాకు వచ్చేసినా, విజయమ్మ ఆమెతో పాటే ఉన్నారు తప్ప కుమారుడి నివాసానికి వెళ్లలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో అడుగుపెట్టే ఉద్దేశమే ఆమెకు లేదని షర్మిల పంచనే ఉండిపోవడం ద్వారా తేటతెల్లం చేశారు. అంతే కాదు గత ఎన్నికల్లో కుమారుడి విజయం కోసం పాటుపడిన విజయమ్మ ఈసారి జగన్ కు మద్దతుగా నిలవడానికి ఇష్టపడలేదని కూడా వైఎస్ కుటుంబ సభ్యులు అప్పట్లో గట్టిగా చెప్పారు.
అభ్యర్థుల ప్రకటన టైంలో జగన్ ను ఆశీర్వదించిన విజయమ్మ ఆ తరువాత ఎక్కడా జగన్ కు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే షర్మిల, సునీత నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్‌గా ప్రచారం చేయాలనే ఒత్తిడి విజయమ్మపై ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే బహిరంగంగా షర్మిలకు మద్దతు ఇస్తూ జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఆమె వెనుకాడారని అంటారు. అందుకే కీలక సమయంలో ఆమె రాష్ట్రానికి దూరంగా అమెరికాకు వెళ్లిపోయారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఆమె తన మద్దతు షర్మిలకే అని ప్రకటిస్తూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ బిడ్డ షర్మిలకే ఓటు వేయాలని ఆమె కడప ప్రజలకు పిలుపు నిచ్చారు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆమె ఇచ్చిన ఈ సందేశంతో ఇప్పటి వరకూ జగన్ విషయంలో షర్మిల చేస్తున్న ఆరోపణలన్నీ వాస్తవమేనని విజయమ్మ సర్టిఫై చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ విజయమ్మ పిలుపు కడప జిల్లా మొత్తాన్నీ జగకు వ్యతిరేకంగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయంటున్నారు.