Read more!

టీడీపీలో కాంగ్రెస్ కోవర్టులు!

 

 

 

పార్లమెంట్, అసెంబ్లీ నోటిఫికేషన్ వెలువడే సమయం దగ్గరవుతున్న కొద్దీ అన్ని పార్టీల్లో వలసల వ్యవహారం వేగం పుంజుకుంటోంది. ముఖ్యంగా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతోంది. తెలుగుదేశం పార్టీ నిండుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు చాలామంది టీడీపీ పంచన చేరారు. ఇంకా చాలామంది నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరడానికి క్యూ కట్టారు. టీడీపీ ఆఫీసు ముందు హౌస్ ఫుల్ బోర్డు పెట్టినా, టిక్కెట్లకు గ్యారెంటీ ఇవ్వమని స్పష్టంగా చెప్పినా ఏ రూల్‌కయినా ఓకే... మీ పార్టీలో చేర్చుకుంటే చాలని కాంగ్రెస్ నాయకులు టీడీపీ నాయకత్వాన్ని ప్రాధేయపడుతున్నారు.

 

ప్రస్తుతం టీడీపీ ఆఫీసు దగ్గర పరిస్థితి చూస్తూ బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు, చెరువు నిండినప్పుడే కప్పలు చేరతాయనే సామెతలు గుర్తొస్తున్నాయి.  తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా, పార్టీకి అండగా నిలిచిన అనేకమంది నాయకులు, కార్యకర్తలకు కొత్తగా పార్టీలోకి వస్తున్న కాంగీయులు తలనొప్పిగా మారారు. కొత్తగా వచ్చిన కొంతమంది కీలక నాయకుల వల్ల ఎప్పటి నుంచో టీడీపిని నమ్ముకుని సేవ చేసిన నాయకుల సీట్లు కదిలే పరిస్థితులు వస్తున్నాయి. అదే విధంగా సీమాంధ్రలో అడ్డంగా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ కొంతమంది కోవర్టులను కావాలనే తెలుగుదేశం పార్టీలోకి పంపిస్తోందన్న అనుమానాలను కొంతమంది టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

 

తెలుగుదేశం పార్టీలో వున్న గుట్టుమట్లను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చెవిలో వేస్తూ వుండటం, కీలక సందర్భాలలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీని నైతికంగా బలహీనపరచడానికి ఈ కోవర్టు శక్తులు పార్టీలోకి వస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ అగ్ర నాయకత్వం జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని భావిస్తున్నారు.