ప్రియాంక గాంధీ అందుకే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు!!
posted on Jan 26, 2019 @ 10:53AM
‘ది ఒడిసా డైలాగ్’ పేరిట శుక్రవారం భువనేశ్వర్ టౌన్‌హాల్‌లో వివిధ రంగాలకు చెందిన వారితో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై స్పందించారు. ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. 'ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం ఈ పది రోజుల్లో ఆకస్మికంగా ప్లాన్ చేసింది కాదు. పార్టీలోకి రావాలని చాలా ఏళ్లుగా ఆమెను అడుగుతూనే ఉన్నాను. ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం అనే ఏకైక కారణంతో వాయిదావేస్తూ వచ్చింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు' అన్నారు. నా ఆలోచనలు, ప్రియాంక ఆలోచనలు దాదాపుగా ఒక్కటే. మమ్మల్ని వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి వివిధ అంశాలపై ప్రశ్నిస్తే .. 80 శాతం సమాధానాలు ఒకేలా ఉంటాయి. మేమిద్దరం చాలా విషయాలపై మాట్లాడుకుంటాం. ఒకరికోసం ఒకరు సర్దుబాటు చేసుకోవాలని భావిస్తాం అన్నారు.
ప్రధాని మోదీపై ఎలాంటి ద్వేషభావం లేదు. ఉన్నదంతా వివిధ అంశాలపై బేధాభిప్రాయాలు మాత్రమే అన్నారు. ఆయా అంశాలపై ఆయనతో గట్టిగా పోరాడతాను. మోదీని గద్దె దించడం నా లక్ష్యం అని పేర్కొన్నారు. ఆయన నన్ను దూషించినప్పుడల్లా ఒక ఆలింగనం ఇవ్వాలని అనిపిస్తుంది. ఆరెస్సెస్, బీజేపీ తిట్లను సైతం దీవెనలుగానే భావిస్తాను అన్నారు. కాంగ్రెస్ అందరి అభిప్రాయాలు వింటుంది. కానీ.. మోదీ అలా కాదు. అన్నీ తనకే తెలుసునని అనుకుంటారు అని ఎద్దేవా చేసారు. బీజేపీకి మాతృక ఆరెస్సెస్. దేశంలోని ప్రతి సంస్థలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తాను మినహా మరో సంస్థ ఉండొద్దని భావిస్తుంది. మంత్రులందరినీ ఆరెస్సెస్ కంట్రోల్ చేస్తోంది అని ఆరోపించారు. వ్యవసాయాన్ని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రైతుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి అని విమర్శించారు.